Share News

ఒడిశా టూ జార్ఖండ్‌

ABN , Publish Date - May 14 , 2026 | 12:36 AM

ఒడిశా నుంచి జార్ఖండ్‌ రాష్ట్రానికి తరలిస్తున్న ఐదు కిలోల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు.

ఒడిశా టూ జార్ఖండ్‌
మాట్లాడుతున్న సీఐ చిన్నంనాయుడు

  • ఐదు కిలోల గంజాయి స్వాధీనం

ఇచ్ఛాపురం, మే 13(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి జార్ఖండ్‌ రాష్ట్రానికి తరలిస్తున్న ఐదు కిలోల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. జార్ఖండ్‌ రాష్ట్రం వెస్ట్‌ సింగ్‌భూమ్‌ జిల్లాకు చెందిన రాజ్ఞా అభిషేక్‌ రాజ్‌సింకు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి జార్ఖండ్‌ రాష్ట్రానికి వెళ్లేందుకు గాను ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ రెండో ప్లాట్‌ఫాంకు వచ్చాడు. ఆర్థిక పరిస్థితి బాగులేక పోవడంతో తన బంధువు అయిన అనురాగ్‌ ఫట్‌ గంజాయి వ్యాపారికి తనకు పని కల్పించాలని కోరినట్లు తెలిపాడు. అతనిని కలిసి ఒడిశా రాష్ట్రం కాంథామాల్‌ ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చినపుడు తనకు సాయంగా ఉంటే ఒక పర్యాయానికి రూ.10 వేలు ఇస్తానని చెప్పాడన్నారు. రాజ్ఞా అభిషేక్‌ కాంథామాల్‌ వెళ్లి కరణ నాయక్‌ నుంచి సుమారు ఐదు కిలోల గంజాయి తీసుకురమ్మన్నాడని చెప్పారు. అతడు చెప్పిన విధంగా బుధవారం సాయంత్రం గంజాయి పట్టుకుని భువనేశ్వర్‌ మీదుగా జార్ఖండ్‌ తీసుకువెళ్లేందుకు రైలు నిలయానికి వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి సోంపేట కోర్డులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ మహేశ్వర్‌ రెడ్డి అభినందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 12:36 AM