Share News

పలాస కిడ్నీ ఆసుపత్రిలో ఎన్టీఆర్‌ వైద్యసేవ

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:59 PM

Kidney Hospital service ‘పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం- 200 పడకల ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలకు చర్యలు చేపట్టాం. ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద ఉచితంగా అన్నీ వ్యాధులకు పరీక్షలు, ఆపరేషన్లు ఇక్కడే నిర్వహిస్తార’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు.

పలాస కిడ్నీ ఆసుపత్రిలో ఎన్టీఆర్‌ వైద్యసేవ
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • త్వరలోనే ఖాళీ పోస్టుల భర్తీ

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • పలాస, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ‘పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం- 200 పడకల ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలకు చర్యలు చేపట్టాం. ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద ఉచితంగా అన్నీ వ్యాధులకు పరీక్షలు, ఆపరేషన్లు ఇక్కడే నిర్వహిస్తార’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక కిడ్నీ ఆసుపత్రిలో కలెక్టర్‌ స్వప్నిల్‌దినకర్‌ పుండ్కర్‌.. ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులకు అందిస్తున్న సేవలు, గ్రామాల్లో వ్యాధులపై జరుగుతున్న పరిశోధనల విషయమై అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోగికి ఇక్కడ సక్రమంగా డయాలసిస్‌ అందించాలని స్పష్టం చేశారు. అనంతరం విలేకరులతో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘కిడ్నీ ఆస్పత్రికి ఎన్టీఆర్‌ వైద్యసేవ మంజూరైంది. దీనిని వినియోగించుకోవాలి. ఎన్టీఆర్‌ వైద్యసేవకు వచ్చే నిధులతో ఆస్పత్రిని కార్పొరేట్‌ తరహాలో అభివృద్ధి చేయవచ్చు. ఆస్పత్రిలో అటెండర్‌ నుంచి ల్యాబ్‌ టెక్నీషియన్‌ వరకు ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తాం. ఈ ప్రాంతంలో ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా వైద్యాధికారుల పోస్టులు భర్తీ విషయంపై ఎంఐడీఎస్‌తో మాట్లాడతాం. ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం. సీసీ కెమెరాలు, వివిధ పరికరాలు సమకూరుస్తాం. ఈ ప్రాంతంలో చెరువులు, కొండలు ఆక్రమణపై చర్యలకు ఆదేశాలు జారీచేశాం. వివిధ అభివృద్ధి పథకాలకు అవసరమైన భూమిని సేకరిస్తామ’ని తెలిపారు. పలాస-కాశీబుగ్గలో తాగునీటి ఇబ్బందులు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించామన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 11:59 PM