ఇక పల్లె పోరు
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:34 AM
Notification for Panchayat elections గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం.. 2026 గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలకు సంబంధించి తొలివిడత నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేసింది. తొలిదశలో జిల్లాలోని పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో ఈ నెల 26న సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
పలాస డివిజన్లోని 7 మండలాల్లో తొలివిడత..
26న పోలింగ్.. అదేరోజు ఫలితాలు
ఏకగ్రీవాలకు భారీ నజరానా
గరిష్టంగా రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం
శ్రీకాకుళం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం.. 2026 గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలకు సంబంధించి తొలివిడత నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేసింది. తొలిదశలో జిల్లాలోని పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో ఈ నెల 26న సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ఎన్నికల వేళ గ్రామాల్లో వర్గ విభేదాలను తగ్గించి, సమైక్యతను పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహక నగదును భారీగా పెంచుతూ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మండలాల్లోనే తొలివిడత ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో 194 పంచాయతీలకు తొలివిడత ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. మండలాలవారీ పరిశీలిస్తే.. ఇచ్ఛాపురంలో 21 పంచాయతీలు , కంచిలిలో 31, కవిటిలో 23, సోంపేటలో 23, పలాసలో 18), మందసలో 41, వజ్రపుకొత్తూరులోని 37 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 316 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.
షెడ్యూల్ ఇలా..
ఈ నెల 15 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ
18న నామినేషన్ల పరిశీలన
19న సాయంత్రం 5 గంటల వరకూ.. సంబంధిత ఆర్డీవో వద్ద అప్పీలుకు అవకాశం
20న అప్పీళ్ల పరిష్కారం
21న నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు. అనంతరం అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థుల తుదిజాబితా ప్రచురణ
26న ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాలు ప్రకటిస్తారు.
ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదేరోజు జరుగుతుంది.
27న అవసరమైన చోట రీపోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.
ఏకగ్రీవాలకు కాసుల వర్షం...
గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలన్నీ ఏకగ్రీవం అయితే ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. సాధారణ ఎన్నికల కోసం జనాభా ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలను భారీగా సవరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
5వేల మంది వరకు జనాభా ఉన్న పంచాయతీలకు.. రూ. 15 లక్షలు (గతంలో 2000 లోపు జనాభా ఉంటే రూ. 5 లక్షలు, 2001-5000 జనాభా ఉంటే రూ. 10 లక్షలుగా ఉండేది) ఇవ్వనుంది.
5,001 నుంచి 10,000 వరకు జనాభా ఉన్న పంచాయతీలకు.. రూ. 25 లక్షలు (గతంలో ఇది రూ. 15 లక్షలుగా ఉండేది) అందజేయనుంది.
10,000 పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 50 లక్షలు (గతంలో ఇది రూ. 20 లక్షలు మాత్రమే ఉండేది) ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించిన పంచాయతీలకు మాత్రమే ఈ నగదు ప్రోత్సాహకం వర్తిస్తుంది. ఈ నిధులను కేవలం ప్రభుత్వ ఆమోద అభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులకు మాత్రమే ఉపయోగించాలి. ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గం పదవీకాలంలో ఈ నిధులను విడతల వారీగా విడుదల చేస్తారు. ఏకగ్రీవాల పథకం పేరుతో ఎవరి ఎన్నికల పోటీ హక్కును కానీ, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును కానీ అడ్డుకోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.