Share News

ఇకపై ఏడు శాతమే

ABN , Publish Date - May 04 , 2026 | 12:17 AM

Change in procedures for collecting rent from municipal shops మునిసిపాలిటీల పరిధిలోని షాపుల అద్దెలు, లీజుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో షాపులు లీజు లేదా అద్దెను ప్రతీ మూడేళ్లకోసారి 33 శాతం చొప్పున పెంచేవారు. ఇకపై దీనిని ఏటా ఏడు శాతం మాత్రమే పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇకపై ఏడు శాతమే
కాశీబుగ్గలో మహాత్మాగాంధీ షాపింగ్‌ కాంప్లెక్స్‌

మునిసిపల్‌ షాపుల అద్దె వసూళ్లకు విధివిధానాల మార్పు

వైసీపీ హయాంలో మూడేళ్లకు 33 శాతం పెంచుతూ వసూళ్లు

నిర్వహణ భారమై.. వ్యాపారులకు తప్పని ఇబ్బందులు

కూటమి ప్రభుత్వం చొరవతో ఊరట

పలాస, మే 3(ఆంధ్రజ్యోతి):

కాశీబుగ్గ ఐడీఎస్‌ఎంటీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మహేశ్వరరావు అనే వ్యాపారి కొన్నేళ్ల కిందట మునిసిపాలిటీ నిర్వహించిన వేలంలో షాపును దక్కించుకున్నాడు. అద్దెపై మూడేళ్లకోసారి 33 శాతం పెంచేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. దీనికితోడు వైసీపీ హయాంలో కొత్త జీవోను తీసుకువచ్చి 200 శాతం అద్దెను పెంచారు. దీంతో నిర్వహణ భారమై.. ఆయన షాపు మూసేశాడు. ఈ వ్యవహారంపై కోర్టులో దావా వేశాడు. జిల్లాలోని మునిసిపాలిటీల పరిధిలో షాప్‌లు దక్కించుకున్న వారిలో చాలామంది వ్యాపారులది ఇదే పరిస్థితి. ఇటువంటి వారందరికీ ఊరటనిచ్చేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడేళ్లకు 33 శాతం అద్దె పెంచకుండా.. ఇకపై ఏటా ఏడు శాతం మాత్రమే పెంచేలా విధివిధానాలు రూపొందించింది. దీని వల్ల మునిసిపాలిటీకి ఆదాయం రాగా.. వ్యాపారులకు కూడా ఉపశమనం లభించనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

.............

మునిసిపాలిటీల పరిధిలోని షాపుల అద్దెలు, లీజుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో షాపులు లీజు లేదా అద్దెను ప్రతీ మూడేళ్లకోసారి 33 శాతం చొప్పున పెంచేవారు. ఇకపై దీనిని ఏటా ఏడు శాతం మాత్రమే పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దెతో పాటు అదనంగా 200 శాతం అద్దె పెంచింది. గతంలో తీసుకున్న ఒప్పందం ప్రకారం ఆ అద్దెపై 33 శాతం మూడేళ్లకు పెంచడానికి మునిసిపాలిటీ రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. షాపులు దక్కించుకున్న వ్యాపారులు.. దీనిపై కోర్టుకు వెళ్లి షాపులకు పూర్తిగా అద్దె చెల్లించడం మానేశారు. ఈ వివాదం కారణంగా మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు 20 శాతం కూడా డబ్బులు వసూలుకాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా మునిసిపాలిటీ ఆదాయం తగ్గి.. ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతోంది. ఈ సమస్య పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పురపాలకశాఖ మంత్రి కె.నారాయణ.. ఇటీవల అధికారుల బృందంతో సమావేశమయ్యారు. మునిసిపాలిటీకి ఆదాయమార్గాలపై చర్చించారు. ఇందులో భాగంగా మూడేళ్లకు 33 శాతం పెంపును ఏడు శాతానికి కుదించారు. అది కూడా ఏటా పెంచడానికి మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. ఇటుంటి లీజుకు షాపుల యజమానులు అంగీకరిస్తే అదనంగా వేలం నిర్వహించకుండా నేరుగా రెన్యువల్‌ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించనున్నారు. అద్దె వసూళ్ల శాతం కుదించడం వల్ల భారం తగ్గి.. తమకు ఊరట లభించనుందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలు ఉన్నాయి. వైసీపీ హయాంలో ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో అద్దె పెంచడం వల్ల మొత్తం షాపులన్నీ మూతపడ్డాయి. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ఏటా రూ.40 లక్షల వరకూ ఆదాయం రావాల్సి ఉండగా, రూ.10 లక్షలకు మించి వసూలు కావడం లేదు. ఆమదాలవలస మునిసిపాలిటీ, శ్రీకాకుళం కార్పొరేషన్‌లో సైతం వసూళ్లు అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా ప్రభుత్వం కల్పించిన ఏడు శాతం వెసులుబాటు వల్ల షాపులు మళ్లీ తెరిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో పుర ఆదాయం పెరిగే చాన్స్‌ ఎక్కువగా ఉంది. దీనిపై వ్యాపారులకు అవగాహన కల్పించి అద్దెలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆర్వో అమర్‌నాథ్‌ తెలిపారు.

Updated Date - May 04 , 2026 | 12:17 AM