ఇక సౌత్‌కోస్ట్ పరిధిలోకి..
ABN , Publish Date - May 06 , 2026 | 12:29 AM
Visakhapatnam Railway Zone Gazette Notification Released రైల్వేశాఖ పరంగా ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరింది. దశాబ్దాలుగా విశాఖ రైల్వేజోన్(సౌత్ కోస్ట్) ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్రం సానుకూలంగా స్పందించడంతో.. విశాఖ జోన్ ఏర్పాటుకు రైల్వేశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇచ్ఛాపురం వరకూ స్టేషన్లన్నీ.. విశాఖ రైల్వేజోన్‌లోనే..
గెజిట్ నోటిఫికేషన్ విడుదల
జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభం
పలాస, మే 5(ఆంధ్రజ్యోతి): రైల్వేశాఖ పరంగా ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరింది. దశాబ్దాలుగా విశాఖ రైల్వేజోన్(సౌత్ కోస్ట్) ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్రం సానుకూలంగా స్పందించడంతో.. విశాఖ జోన్ ఏర్పాటుకు రైల్వేశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ ఒకటో తేదీ నుంచి సౌత్‌కోస్ట్ రైల్వే కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మంగళవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇకపై ఈస్ట్‌కోస్ట్ పరిధిలో పలు స్టేషన్లు.. సౌత్‌కోస్ట్ పరిధిలోకి రానున్నాయని, తద్వారా అభివృద్ధి చెందనున్నాయని జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వేస్టేషన్లన్నీ ఒడిశా రాష్ట్రం ఖుర్ధారోడ్ డివిజన్‌లోనే ఇన్నాళ్లూ మగ్గిపోయాయి. శివారు రైల్వేస్టేషన్లు కావడంతో వివక్షతకు గురయ్యాయని ఆరోపణలు ఉండేవి. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేసి దాని పరిధిలో స్టేషన్లు అభివృద్ధి చేయాలని జిల్లావాసులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కాగా ‘పలాస వరకూ ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోనే ఉండాలి. అందుకు గల సాంకేతిక ఇబ్బందులను పరిశీలించి చర్యలు తీసుకోవాల’ని ఒడిశాలో రాజ్యసభ ఎంపీలతో సహా అక్కడి ప్రజాప్రతినిధులు కేంద్ర రైల్వేశాఖపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో ఈ ప్రాంత ఉద్యోగులు, ప్రజల్లో సైతం ఇంకా ఒడిశా పరిధిలోనే మగ్గాల్సి వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కాగా.. ఇక్కడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక కృషితో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వేస్టేషన ్లన్నీ కొత్తగా ఏర్పాటైన సౌత్‌కోస్టు రైల్వే (విశాఖపట్నం) డివిజన్ పరిధిలోకి వచ్చాయి. దీంతోపాటు ఖుర్ధారోడ్ డివిజన్‌లో ఉన్న ఈ ప్రాంతాలన్నీ విశాఖ రైల్వే డివిజన్‌లోకి వచ్చినట్లు రైల్వేశాఖ ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉద్యోగుల బదిలీలు, హద్దుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. జూన్ ఒకటో తేదీ నుంచి సౌత్‌కోస్టు రైల్వే కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
ఈ స్టేషన్లన్నీ విశాఖ డివిజన్‌లోకి..
ఇచ్ఛాపురం నుంచి పలాస వరకూ 53 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మందస, బారువ, సోంపేట, జాడుపూడి, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లు విశాఖ డివిజన్‌లోకి రానున్నాయి. నౌపడ నుంచి పర్లాకిమిడి వరకూ ఉన్న 39 కిలోమీటర్ల రైల్వే పరిధి కూడా ఇందులోనే విలీనమైంది. ఇచ్ఛాపురం- పలాస- విశాఖపట్నం- దువ్వాడ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న 270 కిలోమీటర్లు, విజయనగరం-కూనేరు రైల్వేస్టేషన్ల పరిధిలో ఉన్న 102 కిలోమీటర్లు, నౌపడ-పర్లాకిమిడి మద్యలో ఉన్న 30 కిలోమీటర్లు, బొబ్బిలి-సాలూరు మధ్యలో ఉన్న 17 కిలోమీటర్లు మొత్తం సౌత్‌కోస్టు పరిధిలోకి వస్తున్నాయని రైల్వేశాఖ కార్యదర్శి ఆర్.మోహన్‌రాజ్ గెజిట్ విడుదల చేశారు. వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించారు. ఒక భాగాన్ని ఈస్ట్‌కోస్టు రైల్వేలో కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు చేయగా, మిగిలిన భాగాన్ని సౌత్‌కోస్టు రైల్వే విశాఖ డివిజన్‌గా మార్చారు.
జోన్ల రూపాంతరం ఇలా..
బీఎన్‌ఆర్ (బెంగాల్-నాగపూర్ రైల్వే)లో రైల్వేశాఖ ఏర్పడిన తొలినాళ్లలో పలాస వరకూ ఉండేది. ఖుర్ధారోడ్ డివిజన్ పరిధిలోనే ఈ ప్రాంతాలు రూపాంతరం చెందాయి. అనంతరం రైల్వేశాఖ జోన్లు విభజనలో భాగంగా సౌత్‌ఈస్ట్రన్ రైల్వే(గార్డెన్‌రీచ్, కోల్‌కతా)లోకి మారింది. జనావాసాలు పెరగడం, రైల్వే ప్రయాణికుల సంఖ్య అధికం కావడంతో మరోసారి జోన్లను పునర్విభజించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే భువనేశ్వర్ కేంద్రంగా ఏర్పడి అందులోనే ప్రస్తుతం వరకూ ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం చొరవతో విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్టు రైల్వేడివిజన్ ఏర్పాటైంది. ఇచ్ఛాపురం నుంచి పలాస వరకూ అన్నీ రైల్వేస్టేషన్లు విశాఖ డివిజన్ పరిధిలోకి తీసుకురావడం. రెండు అసెంబ్లీ కేంద్రాలు, పలాస రెవిన్యూ డివిజన్‌తోపాటు సగభాగం పార్లమెంటరీ నియోజకవర్గమంతా ఒకే రైల్వేడివిజన్ పరిధిలోకి రావడం శుభదాయకం. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందుతాయని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయోజనాలెన్నో..
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుతో జిల్లాలో రైల్వేస్టేషన్లలో అభివృద్ధికి అవకాశం ఉంది. సమస్యలు పరిష్కారం కానున్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు లభించనున్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించే పరీక్షల కోసం ఇన్నాళ్లూ ఒడిశాలోని భువ నేశ్వర్‌కు లేదా తెలంగాణాలోని సికింద్రాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. విశాఖ కేంద్రంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా రైల్వేలో ఉద్యోగాలు నియామకాల కోసం పోటీ పరీక్షలు విశాఖ లోనే నిర్వ హించనున్నారు. అలాగే కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలంటే సికింద్రాబాద్ లేదా భువనేశ్వర్‌కు వెళ్లి అధికారులకు వినతిపత్రాలు అందించాల్సి వచ్చేది. ఇకపై ఏ చిన్న సమస్య వచ్చినా, కొత్త ప్రతిపాదనలు సమర్పిం చాలన్నా విశాఖకే వెళ్లవచ్చు.
కూటమి కృషితో రైల్వేజోన్ సాధ్యం : మంత్రి అచ్చెన్నాయుడు
‘ఉత్తరాంధ్రుల కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కూటమి కృషితోనే విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యమైంద’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘దక్షిణ కోస్తారైల్వే గెజిట్ విడుదలతో.. ఈ ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగం కానుంది. పలాస- ఇచ్ఛాపురం సెక్షన్‌ను, ఇచ్ఛాపురం- దువ్వాడ- విజయనగరం సెక్షన్‌ను, నుప్పాడ- పర్లాకిమిడి, బొబ్బిలి- సాలూరు సెక్షన్లు, సింహాచలం వడ్లపూడి, విశాఖ జగ్గయ్యపాలేం తదితర స్టేషన్లను విశాఖ రైల్వే డివిజన్‌లో విలీనం చేయడం బాగుంది. కోరాపుట్- కిరండోల్ లైను విశాఖ, రాయఘడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించడం, రాయగడ నుంచి విడదీసి విశాఖ డివిజన్ (463 కిలోమీటర్లు మేరకు) కలుపుతూ దక్షిణకోస్తాలో విలీనం చేయడం కూడా బాగుంది. ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామం. వీఎంఆర్డీఏ డెక్‌లోని రెండు అంతస్తుల్లో దక్షిణ కోస్తా రైల్వే జీఎం తాత్కాలిక కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు ఎంతో కృషి చేసిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు అభినందనలు’ అని మంత్రి అచ్చెన్న తెలిపారు.