Share News

తెల్లనివన్నీ పాలుకాదు

ABN , Publish Date - May 31 , 2026 | 11:58 PM

పాలసేకరణ కేంద్రాల దగ్గరకు వచ్చే పాలు నుంచి, ఇంటింటికీ వచ్చే పాలు వరకూ కల్తీ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

 తెల్లనివన్నీ పాలుకాదు

- కల్తీ పాలతో జరభద్రం

-దిగుబడి కోసం పాడిపశువులకు ఇంజెక్షన్లు

- చిక్కదనం కోసం యూరియా కలుపుతున్న వైనం

- ప్రజలు ప్రాణాలతో చెలగాటం

- అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

నరసన్నపేట, మే 31 (ఆంధ్రజ్యోతి): పాలసేకరణ కేంద్రాల దగ్గరకు వచ్చే పాలు నుంచి, ఇంటింటికీ వచ్చే పాలు వరకూ కల్తీ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కల్తీని గుర్తించలేక చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. పరిస్థితి విషమంగా మారేంత వరకూ తెలియకపోవడంతో ప్రాణప్రాయస్థితికి చేరుతున్నారు. జిల్లాలో పాల వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. జిల్లాలో సుమారు 45 లక్షల జనాభా ఉండగా, ముగ్గురు వ్యక్తులకు ఒక లీటరు చొప్పున 15 లక్షల లీటర్ల వరకూ పాలు అవసరం అవుతాయి. జిల్లాలో ఆ మేరకు పాల దిగుబడి లేదు. దీంతో కొందరు వేర్వేరు మార్గాల్లో కల్తీ పాలను తయారు చేసి విక్రయాలు చేపడుతున్నారు. కల్తీని గుర్తించడానికి సరైన నిఘా లేకపోవడంతో ఆ దందా మరింత పెరిగిపోతుంది.

పాల దిగుబడి కోసం ఇంజెక్షన్లు

పాల అధిక దిగుబడి కోసం కొందరు పాడి పశువులకు ఆక్సిటోసిన్‌ అనే ఇంజెక్షన్‌ చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్‌లు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ పాలను తాగితే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్‌ వచ్చే అవకాశం అధికం. కిడ్నీలు సైతం పాడవుతాయి. నాడీవ్యవస్ధ దెబ్బతింటుంది. 19 ఏళ్లు వచ్చినా బాలికలు రజస్వల కారు. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. మహిళలకు రుతుస్రావ ఇబ్బందులు ఏర్పడతాయి.

కొందరు పాల వ్యాపారులు సింథటిక్‌ పాలును విచ్చలవిడిగా పోస్తున్నారు. వీటిని కేవలసం రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా యూరియా కలుపుతారు. పాలను చిక్కదనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. పాలు పుల్లగా అయిపోతే ఆరుచిని మార్చడానికి డిటర్జెంట్లు, సబ్బులు, షాంపులు వాడుతున్నారు. పాలు జిడ్డుగా, కొవ్వుగా ఉండటానికి నూనెలు కలుపుతున్నారు, పాలసాంద్రత పెంచడానికి గంజి వాడుతున్నారు. పాలు అధిక రోజులు నిల్వ ఉండటానికి అందులో బ్యాక్టీరియా పెరగకుండా ఉండటానికి హైడ్రోజన్‌ పెరాక్సెడ్‌ వినియోగిస్తున్నారు. లాక్టోమీటరులో పాలు ఉత్తీర్ణత శాతం చూపించడానికి అమ్మోనియా సల్పేట్‌, తెల్లగా ఉండటానికి తెలుపు పెయింట్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనాలతో తయారు చేసిన పాలు ఆరోగ్యానికి హానికరమని శాస్తవేత్తలు చెబుతున్నారు.

కల్తీని గుర్తించండి ఇలా..

స్వచ్ఛమైన పాలు 0.55 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద గడ్డకడతాయి. ఈ ఉష్ణోగ్రత మారిదంటే అందుల్లో నీరు కలిసిందని అర్థం చేసుకోవచ్చు. సగటున లీటరు పాలలో 2 నుంచి 20శాతం వరకు నీరు ఉంటుంది. లాక్టోమీటరు పరికరంలో పాలుపోయగానే అందులో కొవ్వు కాకుండా ఇతర ఘనపదార్ధాలు ఎంతశాతం ఉన్నాయో తెలిసిపోతుంది. పాలను వేడిచేసినప్పుడు వచ్చే ఆవిరిలో ఏర్పడే ఘనపు రేణువులు స్పటికాల రూపంలో ఘనీభవిస్తే అందులో యూరియా కల్తీ చేశారని కనిపెట్టవచ్చు. డిటర్జెంట్‌ పొడిని కలిపారేమో తెలుసుకోవడానికి ఒక గ్లాసులో 10 మిల్లీ లీటర్ల పాలు అంతే మొత్తంలో నీరు పోసి గిరాగిరా తిప్పి బాగా కలపాలి. డిటర్జెంట్‌ పొడి కలిపి ఉంటే పైగా బాగా నురగ వస్తుంది. స్వచ్ఛమైన పాలయితే కొద్దిగా నురగ వస్తుంది. పాలలో యూరియాను గుర్తించడానికి సులభమైన పద్ధతులు ఉన్నాయి. ఔషధ దుకాణాల్లో యూరియా స్ర్పే స్ట్రిప్స్‌ అమ్ముతుంటారు. వాటిపై కొంచెం పాలుపోయాలి. అందులో గీతలు కనిపిస్తే యూరియాతో తయారు చేసిన కృత్రిమ పాలని అర్థం చేసుకోవచ్చు.

- పోర్టబుల్‌ మిల్క్‌ అనలైజర్లు- అల్ర్టాసోనిక్‌ టెక్నాలజీతో కల్తీపాలను గుర్తించవచ్చు.

- కల్తీపాలను కనిపెట్టేందుకు ఫుడ్‌ స్టేఫ్టీ విభాగం కిట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మ్యాజిక్‌ బాక్స్‌పేరుతో కిట్లను ఆహార తనిఖీ అధికారులకు అందిస్తున్నారు. ఇవి బయట తక్కువ ధరకే లభిస్తాయి.

అప్రమత్తంగా ఉండాలి

కల్తీపాలు చాలా ప్రమాదం. పాడిరైతులు నుంచి కొనుగోలు చేసే సయమంలో పాలను పరీక్షించాలి. యూరియా, ఇతర పదార్ధాలు కలిస్తే పాలను వేడి చేసే సమయంలో సులువుగా గుర్తించవచ్చు. వాసనలో తేడాతో పాటు ఆవిరిలో రేణువులు రూపం వస్తే యూరియా కలిపినట్లు నిర్ధారించాలి. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.

-లక్ష్మి, ఆహార కల్తీ నియంత్రణాధికారి, శ్రీకాకుళం

అవగాహన కల్పిస్తున్నాం

అధిక పాల దిగుబడి కోసం పొదుగుకు ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వకూడదు. ఆ పాలను తాగే వారితో పాటు పాడిపశువులకు కూడా చాలా ప్రమాదకరం. దీనిపై పాడిరైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పాడిపశువులకు దాణా సకాలంలో ఇస్తే పాల దిగుబడి పెరుగుతుంది.

-రాజగోపాలరావు, జేడీ, పశుసంవర్ధక శాఖ, శ్రీకాకుళం

Updated Date - May 31 , 2026 | 11:58 PM