Share News

చినుకు రాలదు.. నారు పెరగదు

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:35 AM

Rain fails to arrive... farmers worried ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలోనే రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. వర్షాకాలం ప్రారంభమైనా.. జిల్లాలో ఎక్కడా చినుకు జాడలేదు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. ఇప్పటివరకు ఆశించినస్థాయిలో వర్షాలు కురవలేదు.

చినుకు రాలదు.. నారు పెరగదు
జలుమూరు : పెద్దదూగాం వద్ద వరినారు మడిని నీటితో తడుపుతున్న రైతు

  • ఖరీఫ్‌ ఆరంభంలోనే వర్షాభావ పరిస్థితులు

  • ఆశించినస్థాయిలో కురవని వర్షాలు

  • కాలువల ద్వారా అందని సాగునీరు

  • ఎండిపోతున్న నారుమళ్లు, వరి ఎదలు

  • బీడు భూములను తలపిస్తున్న పొలాలు

  • ఆందోళనలో రైతులు

  • నరసన్నపేట/ కోటబొమ్మాళి/ జలుమూరు/ గార, జూలై 10(ఆంధ్రజ్యోతి):

    ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలోనే రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. వర్షాకాలం ప్రారంభమైనా.. జిల్లాలో ఎక్కడా చినుకు జాడలేదు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. ఇప్పటివరకు ఆశించినస్థాయిలో వర్షాలు కురవలేదు. ఎల్‌నినో ప్రభావంతో జూన్‌లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెలలోనూ అదే పరిస్థితి నెలకొంది. తొలకరి జల్లును నమ్మి జిల్లాలో రైతులు వరినారు, ఎదలు వేశారు. కాగా ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేయడంతో నారుమళ్లు, ఎదలు(విత్తనాలు జల్లే విధానం) ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల మొలకలు కూడా రాకపోవడంతో వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. నారుమడులకు నీటితడి అందించేందుకు నానా పాట్లు పడుతున్నారు.

  • జిల్లాలో సుమారు 3.56 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పోలాకి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, శ్రీకాకుళం రూరల్‌, గార, ఆమదాలవలస, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం, పలాస తదితర మండలాల్లో వరినారు మళ్లు, ఎదలు పూర్తయ్యాయి. చినుకు జాడ లేకపోవడంతో రైతులు కలవరపడుతున్నారు. కొన్నిచోట్ల వర్షాలు లేక.. నారు మొలకలు రాక దిగులు చెందుతున్నారు. సమయానికి వర్షాలు పడతాయనే ఆశతో విత్తనాలు, దుక్కుల కోసం వేలాది రూపాయలు ఖర్చుచేసి నారు పోశామని, ఇప్పుడు నీరు లేక ఎండిపోతుండడంతో ఏంచేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు.

  • జలుమూరు మండలం పెద్దదూగాం, చిన్నదూగాం, ఏనేటికొత్తూరు, రావిపాడు, తదితర ప్రాంతాల్లో వరినారుమళ్లు ఎండిపోతున్నాయి. వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడిచిపెట్టినా.. పిల్ల కాలువలకు అందడం లేదు. దీంతో అందుబాటులో ఉన్న చెరువులు, బావుల నుంచి రైతులు బకెట్లతో నీటిని తెచ్చి.. నారుమళ్లు తడుపుతున్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.

  • గార మండలంలోని వత్సవలసతోపాటు పలు గ్రామాల్లో రైతులు రెండు వారాల కిందట వరి ఎదలు, నారుమళ్లు పోశారు. తర్వాత కొద్దిపాటి వర్షం కురవడంతో ఎదలు, వరినారుకి కొద్దిగా మొలకలు వచ్చాయి. తర్వాత వర్షాలు కురవలేదు. చెరువులు, కాలువల్లో కూడా నీరు లేదు. దీంతో ఎదలు, వరినారు మొలకలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశధార నీటిని కాలువల ద్వారా పొలాలకు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

  • వర్షాధార భూముల్లో సాగు ఎలా?

  • జిల్లాలో రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం తదితర మండలాల్లో వర్షాధారంపైనే ఆధారపడి వరి సాగు చేస్తుంటారు. వంశధార, నాగావళి నదుల నుంచి కాలువల ద్వారా ఈ ఏడాది సాగునీటి పుష్కలంగా వచ్చే అవకాశం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారాయణపురం వద్ద నాగవళి నీటి మట్టం పెరిగితేనే.. నదీ పరివాహక ప్రాంతాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఇప్పటివరకు నాగావళిలో నీరు లేకపోవడంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు వేరుశనగ, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు సైతం ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Jul 11 , 2026 | 12:35 AM