చినుకు రాలదు.. సాగు సాగదు
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:59 PM
Rainfall shortage due to El Nino effect ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే అన్నదాతలకు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా.. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు రోహిణె కార్తెను తలపిస్తున్నాయి. చినుకు జాడ లేదు. వరుణుడు కరుణించడం లేదు.
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
ఎండిపోతున్న వరిఎదలు, నారుమళ్లు
పూజలు చేసినా కరుణించని వరుణుడు
ఆందోళనలో అన్నదాతలు
నరసన్నపేట/ టెక్కలి/ సోంపేట, జూలై 28 (ఆంధ్రజ్యోతి):
ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే అన్నదాతలకు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా.. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు రోహిణె కార్తెను తలపిస్తున్నాయి. చినుకు జాడ లేదు. వరుణుడు కరుణించడం లేదు. గాలి, ఎండ తీవ్రత వల్ల భూమిపై పదును కూడా ఆరిపోయింది. కాలువల్లో నీరు అరకొరగా వస్తున్నా.. పొలాలకు చేరడం లేదు. దీంతో వరినాట్లు, వరి ఎదలు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు అన్నదాతలు పాట్లు పడుతున్నారు. వరుణుడి కోసం ఎన్నో పూజలు చేస్తున్నారు. అయినా కరుణించకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
...............
ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండడంతో రైతుల్లో నిరాశ, నిస్పృహలు చోటుచేసుకున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనమని, ద్రోణి ప్రభావమని ఊరించినా వర్షాలు జాడలేకుండా పోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, వాగులు, గెడ్డల్లో చుక్కనీరు లేని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సుమారు 4లక్షల ఎకరాల్లో వరిసాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక.. కాలువల ద్వారా సాగునీరు అందక వరినాట్లు, ఎదలు ఎండిపోతున్నాయి. సమీప చెరువులు, బావుల్లో ఉన్న అరకొర నీటిని తెచ్చి.. నారుమళ్లను రక్షించుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు.
నరసన్నపేట నియోజవర్గంలో నరసన్నపేట, జలుమూరు, పోలాకి, సారవకోట మండలాల్లో ఈ ఏడాది 16వేల ఎకరాల్లో వరిసాగు చేపడుతున్నారు. 90 శాతం మేరకు ఎదలు వేయగా.. 10 శాతం మాత్రమే వరినారు మళ్లు వేశారు. గత రెండు వారాలుగా చినుక జాడ లేకపోవడంతో నరసన్నపేట, పోలాకి మండలాల్లో వరి ఎదలు ఎండిపోతున్నాయి. నారుమళ్లు రాగి రంగులో మారుతున్నాయి. వంశధార కాలువల్లో సాగునీరు విడిచిపెట్టినా తగినంత స్థాయిలో రాకపోవడంతో పొలాల్లోకి వెళ్లడం లేదు. నరసన్నపేట మండలం కామేశ్వరిపేట, లుకలాం, నర్సింగరాయుడుపేట, సుందరాపురం, పారశెల్లి, చోడవరం, ఉర్లాం, చింతువానిపేట, కోమర్తి, మాకివలస, మడపాం, గోపాలపెంట, బాలసీమ, చిక్కాలవలస పోలాకి మండలం జిల్లేడివలస, చీడివలస, ఈదులవలస, సుసరాం, డోల, ఉర్జాం, జడూరు తదితర ప్రాంతాల్లో వరి ఎదలు ఎండిపోతున్నాయి. ఓపెన్‌హెడ్ చానెల్స్ ద్వారా కూడా నీరు రాకపోవడంతో ఉర్లాం, నడగాం, చోడవరం, లుకలాం తదితర ప్రాంతాల్లోని వరి ఎదలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలని, ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
లోటు వర్షపాతం
జిల్లాను లోటు వర్షపాతం వెంటాడుతోంది. ఈ ఏడాది జూన్ నెలలో టెక్కలి డివిజన్‌లో 141.7 మిల్లీమీటర్లు వర్షపాతం కురవాల్సి ఉండగా 108.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మైనస్ 23.1 మిల్లీమీటరు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం డివిజన్‌లో 125.2 మిల్లీమీటర్ల వర్షపాతానికిగానూ 87.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మైనస్ 29.9మిల్లీమీటర్ల వర్షపాతం లోటు కనిపించింది. పలాస డివిజన్‌లో 143.3 మిల్లీమీటర్లు వర్షపాతం కురవాల్సి ఉండగా 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మైనస్ వంద మిల్లీమీటర్ల వర్షపాతం లోటు ఉంది.
జూలై నెలలో టెక్కలి డివిజన్‌లో 182.4 మిల్లీమీటర్లు వర్షపాతం కురవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు 43.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం డివిజన్‌లో 138.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 45.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. పలాస డివిజన్‌లో 155.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 74.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గణాంకశాఖ ద్వారా తెలుస్తోంది.
కరుణించని వరుణుడు
వరుణుడి కరుణ కోసం ఆచార సంప్రదాయాల ప్రకారం.. ఎంతో నమ్మకంతో కప్పలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. శివాలయాల్లోని గర్భగుడిలో శివలింగాలకు జలభిషేకం చేస్తున్నారు. గ్రామాల్లో వరద పాయసం తయారు చేసి పంచి పెడుతున్నారు. సముద్రతీరంలో వరుణ జప యాగాలు చేస్తున్నారు. కొండ కోనల్లో కొండ దేవతలకు జంతు బలులు ఇచ్చి పూజిస్తున్నారు. గ్రామదేవతలకు ముర్రాటలు చెల్లిస్తున్నారు. అయినా వరుణుడు కరుణించడం లేదు.
సాగునీరు విడిచిపెట్టాలి
ఎండల తీవ్రతకు వరి ఎదలు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది పంటలు పండే పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు స్పందించి కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు విడిచిపెట్టాలి.
- యాళ్ల వేణుగోపాలరావు, రైతు, మాకివలస