అహింస, పరిశుభ్రతే ప్రగతికి బాటలు
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:19 AM
Birth anniversaries of Gandhi and Lal Bahadur Shastri పరిశుభ్రత, అహింసా మార్గాలే ప్రగతికి నిజమైన బాటలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
వ్యవస్థలను గౌరవించాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రత, అహింసా మార్గాలే ప్రగతికి నిజమైన బాటలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ విగ్రహానికి, లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి. దేశంలో యువత, ఉద్యోగులు తమ సమస్యలపై పోరాడేటప్పుడు గాంధీజీ చూపిన అహింసా మార్గాన్ని అనుసరించాలి. హింసకు తావులేకుండా వ్యవస్థలకు గౌరవించాలి. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనంలోని ప్రతీ విభాగంలో గాంధీజీ సూక్తులను ప్రదర్శిస్తాం. ఇవి ఉద్యోగులు, ప్రజల్లో మంచి మార్పుకు దోహదపడతాయ’ని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే లాల్‌బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలు, అందించిన హరిత విప్లవం, సరిహద్దు దళాల పటిష్టత వంటి చర్యలు అజరామరమని, అనుసరణీయమన్నారు. ఆయన పాటించిన ఉన్నత విలువలు, నిజాయితీ, నిరాడంబరత ఆదర్శనీయమని కొనియాడారు. జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ సేవలలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, అదే వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవమన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో సాయిప్రత్యూష, కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణ పాల్గొన్నారు.