జోరందుకున్న నామినేషన్లు
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:02 AM
94 nominations for ZPTC seats, 1,442 nominations for MPTC seats స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల పర్వం జోరందుకుంది. బుధవారం జిల్లాలో 30 జడ్పీటీసీ స్థానాలకు, 542 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
రెండోరోజు కుప్పలుతెప్పలుగా దాఖలు
గురువారం ఒక్కరోజే జడ్పీటీసీ స్థానాలకు 94
ఎంపీటీసీ స్థానాలకు 1,442 నమోదు
నేటితో ముగియనున్న గడువు.. రేపటి నుంచి పరిశీలన
శ్రీకాకుళం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల పర్వం జోరందుకుంది. బుధవారం జిల్లాలో 30 జడ్పీటీసీ స్థానాలకు, 542 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు పెద్దగా నామినేషన్లను పలు మండలాల నుంచి లేవు. కానీ రెండోరోజు గురువారం మాత్రం కుప్పలుతెప్పలుగా దాఖలయ్యాయి. శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలో సీఈఓ వెంకట్రామన్ జడ్పీటీసీ అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. అలాగే ఎంపీటీసీలకు సంబంధించి ఆయా మండలాల వారీగా ఎంపీడీవోలు అందుకున్నారు.
గురువారం 30 జడ్పీటీసీ స్థానాలకుగానూ 94 నామినేషన్లు దాఖలయ్యాయి. 542 ఎంపీటీసీ స్థానాలకు 1,442 నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా ఈ రెండు రోజుల నామినేషన్లను పరిశీలిస్తే.. జడ్పీటీసీ స్థానాలకులకు 118, ఎంపీటీసీ స్థానాలకు 1,715 నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ల కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అంతటా బలగాలుగా మోహరించారు. నిబంధనల మేరకు అభ్యర్థులను నామినేషన్ల కేంద్రంలోకి అనుమతించారు.
శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. దీంతో శుక్రవారం పెండింగ్ అభ్యర్థులు.. జడ్పీ పీఠాన్ని ఆశిస్తున్న వారు తమ సతీమణులను నామినేషన్లతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు. శనివారం నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది.
వెనుకపడిన కాంగ్రెస్
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. ఇంకనూ కోలుకోలేదు. ఆ పార్టీ నామినేషన్ల సంఖ్యను చూస్తే.. స్వతంత్య్ర అభ్యర్థుల కన్నా తక్కువగా ఉంది. ఎంపీటీసీల విషయానికొస్తే.. స్వతంత్ర అభ్యర్థులు 44 మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తంగా 10 మాత్రమే దాఖలయ్యాయి. జడ్పీటీసీల విషయానికొస్తే... ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నలుగురు నామినేషన్ వేశారు. కాంగ్రెస్పార్టీ నుంచి కూడా నలుగురే నామినేషన్లు దాఖలు చేశారు.
పార్టీల వారీగా నామినేషన్లు :
542 ఎంపీటీసీ స్థానాలకు గాను.. బీఎస్పీ 1, బీజేపీ 35, సీపీఐ(ఎం) 7, కాంగ్రెస్ 10, జనసేన 84, టీడీపీ 744, వైసీపీ 785, ఇతరులు 5, ఇండిపెండెంట్లు 44 మంది నామినేషన్లు ఇప్పటివరకు సమర్పించారు.
30 జడ్పీటీసీ స్థానాలకుగాను... బీజేపీ 10, సీపీఐ(ఎం) 4, కాంగ్రెస్ 4, జనసేన 8, టీడీపీ 37, వైసీపీ 51, ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 నామినేషన్లను ఇప్పటివరకు సమర్పించారు.