Share News

నేటి నుంచి నామినేషన్లు

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:47 AM

Election code comes into effect ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకుగానూ శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. స్థానిక రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది.

నేటి నుంచి నామినేషన్లు
పలాస: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్‌

  • పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో ఎన్నికల నగారా!

  • జిల్లావ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కోడ్‌

  • ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రత్యేక నిఘా..

  • శ్రీకాకుళం/ పలాస/ ఇచ్ఛాపురం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకుగానూ శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. స్థానిక రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. టికెట్ల వేట, అభ్యర్థుల ఎంపికతో ఈ రెండు మునిసిపాలిటీల్లో రాజకీయ సెగ రాజుకుంది. మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.

  • ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలోని 28 వార్డులు, పలాస-కాశీబుగ్గ పరిధిలోని 36 వార్డులు.. వెరసి మొత్తం 64 వార్డుల సభ్యులతోపాటు చైర్‌పర్సన్‌ల స్థానాలకు ఈనెల 28న పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు శుక్రవారం... వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శించనున్నారు. ఇదే రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు. 19న నామినేషన్లను పరిశీలిస్తారు. 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గుడవు. ఆ వెంటనే మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ. 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌. 29న అవసరమైతే రీ-పోలింగ్‌ నిర్వహిస్తారు. 30న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిస్తారు.

  • కోడ్‌ ఉల్లంఘిస్తే వేటే!...

  • ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, అధికారులు కోడ్‌ను కఠినంగా పాటించాల్సిందేనని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల నియామవళి అమలుపై గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని మొత్తం 30 మండలాలకు తహసీల్దార్ల నేతృత్వంలో ప్రత్యేక ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) బృందాలను రంగంలోకి దించామని తెలిపారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఈ బృందాల పనితీరును కలెక్టర్‌ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఇచ్ఛాపురం, పలాస తహసీల్దార్లు సైతం తమ బృందాలతో ఆయా మునిసిపాలిటీల్లో నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ వాహనాలు, సిబ్బంది, ఇతర వనరులను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ప్రచారాల్లో పాల్గొన్నా, రాజకీయ కార్యకలాపాలకు మద్దతు తెలిపినా సస్పెన్షన్‌ వేటు తప్పదని తహసీల్దార్లు, ఎంపీడీవోలకు కలెక్టర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

  • ఫిర్యాదుల కోసం ప్రత్యేక అధికారులు...

  • ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో ఎన్నికల కోడ్‌ అమలును పర్యవేక్షించేందుకు, ఉల్లంఘనలపై నిఘా కోసం తహసీల్దార్లను ఎంసీసీ బృందం అధికారులుగా నియమించారు. ఇచ్ఛాపురం తహసీల్దార్‌ ఎన్‌.వెంకటరావు ఫోన్‌: 8333988788, పలాస-కాశీబుగ్గ తహసీల్దార్‌ బి.శ్రీదేవి ఫోన్‌ 9949374589 నెంబర్లకు ఫిర్యాదులు చేయాలి.

  • పకడ్బందీగా ఏర్పాట్లు

  • ‘ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల వద ్ద అవాంతరాలు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఉన్నతపాఠశాలలో కౌంటింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కమిషనర్‌ శ్రీనివాసులను ఆదేశించారు. స్ట్రాంగ్‌రూములు, పోలింగ్‌ కేంద్రాల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్‌రూముల సంఖ్య పెంచాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ అప్పలరాజు, తహసీల్దార్‌ శ్రీదేవి పాల్గొన్నారు.

  • ఇచ్ఛాపురంలో సర్వం సిద్ధం

  • ఇచ్ఛాపురంలో మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్దం చేశారు. మునిసిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ స్థానంతోపాటు 28వార్డులకు సంబంధించిన అభ్యర్థుల కోసం నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశామని కమిషనర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎన్‌.రమేష్‌ తెలిపారు.

Updated Date - Oct 16 , 2026 | 12:47 AM