Share News

లక్షణాలు కనిపించవు.. ఎముకలు గుల్లబారుతాయ్‌

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:55 PM

Today is World Osteoporosis Day మారుతున్న ఆహారపు అలవాట్లతో చాలామంది జీవనశైలిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది బయటకు ఆరోగ్యంగా కనిపించినా.. లోలోపల మాత్రం ఎముకలు గుల్లబారిపోయి ఏ చిన్న పనిచేసినా అలసటకు గురవుతుంటారు. ఎముకల సాంద్రత బలహీనపడి.. వెన్నునొప్పి.. మోకాళ్లు, మోచేతి నొప్పులు.. ఇతర రుగ్మతలతో బాధపడుతుంటారు.

లక్షణాలు కనిపించవు.. ఎముకలు గుల్లబారుతాయ్‌

అవగాహన, అప్రమత్తతే కీలకం

పౌష్టికాహారం ఎంతో అవసరం

నేడు ప్రపంచ ఆస్టియోపోరోసిస్‌ దినోత్సవం

శ్రీకాకళం కల్చరల్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి):

శ్రీకాకుళం నగరానికి చెందిన రామారావు.. ఉద్యోగ విరమణ తర్వాత భార్యతో కలిసి సాఫీగా జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ల కిందట కుర్చీలో కూర్చొని లేవబోతుండగా.. అతని ఎడమ మోచేయి ఎముక విరిగిన శబ్దం రావడంతో తల్లడిల్లిపోయారు. వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లగా.. ఎముక గుల్లబారి విరిగిందని నిర్ధారించారు. మందులు వాడుతూ.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

..........

మారుతున్న ఆహారపు అలవాట్లతో చాలామంది జీవనశైలిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది బయటకు ఆరోగ్యంగా కనిపించినా.. లోలోపల మాత్రం ఎముకలు గుల్లబారిపోయి ఏ చిన్న పనిచేసినా అలసటకు గురవుతుంటారు. ఎముకల సాంద్రత బలహీనపడి.. వెన్నునొప్పి.. మోకాళ్లు, మోచేతి నొప్పులు.. ఇతర రుగ్మతలతో బాధపడుతుంటారు. మంగళవారం ప్రపంచ ఆస్టియోపోరోసిస్‌(ఎముకల గుల్లబారే వ్యాధి) దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఆర్ధోపెడిక్స్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ ప్రసన్న కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఆస్టియోపోరోసిస్‌కు సంబంధించి బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. అకస్మాత్తుగా ఎముకలు గుల్లబారి విరిగిపోతుంటాయి. వయసు పైబడినవారిలో ఎక్కువగా ఇలా జరుగుతుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మధ్య వయసు మహిళలు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఎముకల లోపల తేనెపట్టు లాంటి నిర్మాణం దట్టంగా బలంగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్‌ బారిన పడితే.. ఈ నిర్మాణంలో ఖాళీలు పెరిగి ఎముక సాంద్రత తగ్గుతుంది. ఎముకలు బలహీనంగా మారి చిన్నదెబ్బకే విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో నడుస్తూ పడిపోవడం.. కూర్చొని లేచేటప్పుడు.. ఎముకలు విరుగుతుంటాయి. మెనోపాజ్‌ దాటిన మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గడం ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాల్షియం, డి-విటమిన్‌ లోపం, తక్కువ బరువు ఉన్న వాళ్లు, ధూమపానం, మద్యం అలవాటు కలిగినవారు.. ఆస్టియోపోరోసిస్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

ఇలా తెలుసుకోవచ్చు

దెక్సా లేదా, బీఎండీ పరీక్ష ద్వారా ఎముకల సాంద్రతను తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలో -1 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ ఉంటే సాధారణ ఎముక సాంద్రతగా పరిగణిస్తారు. -1 కంటే తక్కువ, -2.5 కంటే ఎక్కువ స్కోర్‌ ఉంటే ఎముక సాంద్రత తగ్గినట్టే. -2.5 లేదా అంతకంటే తక్కువ స్కోర్‌ ఉంటే ‘ఆస్టియోపోరోసిస్‌’గా పరిగణిస్తారు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో.. దీనిని ప్రాథమిక దశలో గుర్తించడం కష్టమవుతోంది.

ఎముకలు బలంగా ఉండాలంటే..

కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు తినాలి. పాలు, పెరుగు తాగాలి. పన్నీరు, రాగులు, నువ్వులు, శనగలు, ఆకుకూరలతోపాటు చేపలు, మాంసం తదితర పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. శరీరానికి సూర్యకాంతి తగలాలి. తగిన వ్యాయామం చేస్తే రక్తప్రసరణ మెరుగుపడి.. ఎముకలు, కండరాలు బలపడతాయి. ధూమపానం, ఆల్కహాల్‌ వంటి అలవాట్లు తగ్గించుకోవాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వృద్ధుల ఆహారం, వ్యాయామం, మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ ప్రసన్న కుమార్‌ స్పష్టం చేశారు.

Updated Date - Oct 19 , 2026 | 11:55 PM