సిబ్బంది లేక.. ఇబ్బందులు తీరక
ABN , Publish Date - May 05 , 2026 | 12:15 AM
Problems in government hospital శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్ - రిమ్స్)కి నిత్యం వేలాదిగా ప్రజలు అనారోగ్య సమస్యలతో వస్తుంటారు. వారిలో అధికశాతం సామాన్యులు, పేదలే. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేక, ఇదే మా పాలిట దేవాలయం అనే భావనతో వస్తారు. కాగా ఎంతో నమ్మకంతో ఆసుపత్రికి వస్తున్న రోగులకు.. సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సమస్యల వలయంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి
పూర్తిస్థాయిలో అందని సేవలు
రోగులకు తప్పని అవస్థలు
అరసవల్లి, మే 4(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్ - రిమ్స్)కి నిత్యం వేలాదిగా ప్రజలు అనారోగ్య సమస్యలతో వస్తుంటారు. వారిలో అధికశాతం సామాన్యులు, పేదలే. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేక, ఇదే మా పాలిట దేవాలయం అనే భావనతో వస్తారు. కాగా ఎంతో నమ్మకంతో ఆసుపత్రికి వస్తున్న రోగులకు.. సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేరుకే ఇది వెయ్యి పడకల ఆసుపత్రి. కానీ సిబ్బంది సంఖ్య అరకొర మాత్రమే. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు, నాయకులు ఎన్నిసార్లు ఆసుపత్రిని సందర్శిస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడం గమనార్హం.
అరకొర నర్సింగ్ సిబ్బంది
జీజీహెచ్‌లో 650 మంది స్టాఫ్‌నర్సులు ఉండాలి. ప్రస్తుతం 382 మాత్రమే పనిచేస్తున్నారు. అందులోను మరో 16 మందిని డేటా ఎంట్రీ ఆపరేటర్ల విధులకు కేటాయించారు. దీంతో రోగులకు అందించే సేవల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకంగా అత్యవసర సేవలు, స్త్రీ, ప్రసూతి విభాగం, శస్త్రచికిత్సల విభాగాలు సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. ప్రతీ నెల కనీసం 35వేల మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. అలాగే ఇన్ పేషేంట్లుగా సుమారు 2,700 మంది చేరుతున్నారు. అరకొర సిబ్బందితో రోగుల సంరక్షణ, మందుల పంపిణీ, అత్యవసర సేవలు పూర్తిస్థాయిలో ఎలా అందుతాయో అధికారులు, నాయకులు ఆలోచించాలి.
తీవ్ర ఎన్‌ఎంవోల కొరత...
రోగులను వార్డులకు, శస్త్రచికిత్స, ఎక్స్‌రే, స్కానింగ్ గ దులకు తీసుకెళ్లడం వంటి సేవలు అందించే ఎన్‌ఎంవోల కొరత వెంటాడుతోంది. అత్యవసర చికిత్సల కోసం అంబులెన్స్‌లో వచ్చే రోగులను స్ట్రెచర్‌పై తీసుకువెళ్లేందుకు కూడా తగినంత సిబ్బంది లేరు. దీంతో రోగుల బంధువులు, సహాయకులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను మార్చురీకి(శవాగారం) తరలించేందుకు కూడా సిబ్బంది లేకపోవడం అత్యంత విచారకరం. షిఫ్ట్‌కు కనీసం ఇద్దరు చొప్పున.. రోజుకు ఆరుగురు సిబ్బంది అవసరం. కానీ ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆ ఒక్కరు 24 గంటలు ఎలా సేవలందించగలదో ఆ దేవుడికే తెలియాలి.
జీడీఏలు ఒక్కరూ లేరు
ప్రతీ ఆసుపత్రిలో జనరల్ డ్యూటీ అటెండెంట్స్ ఉంటారు. వీరు ఎక్కడ ఏ అవసరం ఉన్నా అన్ని రకాల సేవలకు సిద్ధంగా ఉంటారు. జీజీహెచ్‌కు సంబంధించి 30 మంది ఉండాలి. కానీ ఈ ఆసుపత్రిలో ఒక్క జీడీఓ ఉద్యోగి లేకపోవడం గమనార్హం.
ఒక్కరే దోబీ
జీజీహెచ్‌లో వెయ్యి పడకలు ఉండగా.. దోబీ కేవలం ఒక్కరే ఉన్నారు. వివిధ వార్డుల్లో రోగులు వాడిన దుప్పట్లు, బ్లాంకెట్లు, దిండు కవర్లు, ఆపరేషన్ థియేటర్లలో దుస్తులు, మొదలైన వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ఎలా? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా సరే దోబీలను నియమించడం లేదు.
విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నా..
ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలో చిన్నపిల్లల వార్డు, రిమ్స్ కళాశాలలో, అలాగే గత నెల 16న రేడియాలజీ విభాగంలో ప్రమాదాలు జరిగి కంప్యూటర్లు, ఫ్యాన్లు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ఆసుపత్రిలో 25 మంది ఎలక్ట్రీషియన్లు ఉండాలి. కానీ ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులోను ఒకరు దివ్యాంగుడు కావడం గమనార్హం.
టెక్నీషియన్లు లేక..
ఆసుపత్రిలో మూడు షిప్టుల్లో శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. 20 మంది అనస్థీషియా టెక్నీషియన్స్ అవసరం కాగా.. కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. థియేటర్ అసిస్టెంట్ల కొరత తీవ్రంగా ఉంది. మినిస్టీరియల్ సిబ్బంది 50 మందికిగాను ఆరుగురు మాత్రమే ఉన్నారు. 7 లిఫ్ట్‌లకు ఒక్కరే ఆపరేటర్. ఆసుపత్రికి ఫైర్ సేఫ్టీ అధికారి, సిబ్బంది లేనే లేరు. సంవత్సరాల కొద్దీ ఆసుపత్రిలో ఇవే పరిస్థితులు కొనసాగుతున్నా పట్టించుకున్న నాథుడు కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి, పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. అనుమతి వచ్చిన వెంటనే నియమాకానికి చర్యలు చేపడతాం. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం.
- డా.ప్రసన్నకుమార్, సూపరింటెండెంట్, జీజీహెచ్