కాలువలపై దుకాణాలు వద్దు
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:14 AM
We will seize shops if they litter the roads ‘కాలువలపై వ్యాపారులు దుకాణాలు పెట్టొద్దు. రోడ్లపై చెత్త వేస్తే దుకాణాలను సీజ్ చేస్తాం. కాలువల్లో భవన నిర్మాణ చెత్తను వేస్తే సహించేది లేద’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు.
రోడ్లపై చెత్త వేస్తే షాపులను సీజ్ చేస్తాం
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
అరసవల్లి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ‘కాలువలపై వ్యాపారులు దుకాణాలు పెట్టొద్దు. రోడ్లపై చెత్త వేస్తే దుకాణాలను సీజ్ చేస్తాం. కాలువల్లో భవన నిర్మాణ చెత్తను వేస్తే సహించేది లేద’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. ఆదివారం శ్రీకాకుళం పాతబస్టాండ్ వద్ద మేదరవీధి, చిన్నబజారు రోడ్డు, ఇప్పిలివీధి, రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించారు. కాగా ఇటీవల డయేరియా వ్యాప్తి నేపథ్యంలో వారం రోజులపాటు చికెన్ షాపులు తెరవరాదని ఆదేశించినా.. కొంతమంది నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ షాపులను మూసివేయించారు. చికెన్, మటన్ దుకాణదారులు.. కాలువల్లోనే వ్యర్థాలను పడేయడం సరికాదన్నారు. చెత్త రోడ్డపై కూడా వేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలను అనుసరిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని, పరిశుభ్రతకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలుషిత ఆహారం విక్రయిస్తే.. ఆహార నియంత్రణ అధికారులు కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకుంటారని తెలిపారు.
పూర్తిగా అదుపులోకి డయేరియా
శ్రీకాకుళం నగరంలో డయేరియా పూర్తిగా అదుపులోకి వచ్చింది. డయేరియా ప్రభావిత ప్రాంతాలైన దమ్మలవీధి, కాకివీధి, మంగువారితోట, గుడివీధిలో ఆదివారం 4 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటివరకూ మొత్తం 214 డయేరియా కేసులు నమోదు కాగా.. 116 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగిలిన బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా ఆదివారం ఉదయం అన్ని డివిజన్లలో ఉదయం నుంచే ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. 20 మంది ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో కాలువల పూడిక తీత, చెత్త ఏరివేత పనులను నిర్వహించారు. పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించి.. తగు సూచనలు చేశారు. నగరంలో డయేరియా తగ్గుముఖం పట్టిందని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. కనీస జాగ్రత్తలు పాటించాలని, పరిసరాల పరిశుభ్రతలో ప్రజలందరూ భాగస్వామ్యమైతే శతశాతం ఫలితాలు సాధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మునిసిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.