మరమ్మతులు లేక.. రక్షణకు నోచుకోక
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:38 PM
పలాస మండలంలోని పాత జాతీయ రహదారిపై ఉన్న వంతెనల వద్ద రక్షణగోడలు విరిగిపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి.
పలాస రూరల్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): పలాస మండలంలోని పాత జాతీయ రహదారిపై ఉన్న వంతెనల వద్ద రక్షణగోడలు విరిగిపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి. ప్రధానంగా కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో వాహనచోదకులు, ప్రయాణికులకు రక్షణ లేకుండాపోయింది. పాత జాతీయ రహదారి మీదుగా పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని పలు గ్రామీణ ప్రాం తాలకు వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధాన బట్టీలు, కాలువల వద్ద వంతెనలు, రక్షణగోడలు నిర్మించారు. అయితే అవి పాతబడడంతో గోడలు బీటలు వారడం, వాహనాలు అంచులు తాకడంతో గోడలు ఊడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలాస మండలంలోని గరుడఖండి జంక్షన్ వద్ద దేశిబట్టి వద్ద గల కాలువ వద్ద ఉన్న వంతెన రక్షణగోడ బీటలు వారిపోయింది. ఇక్కడ వాహనాలు ఈ గోడను ఢీకొన్నా 15 అడుగుల కిందకు జారిపోయే ప్రమాదం పొంచిఉందని చోదకులు చెబుతున్నారు. పలాస-వజ్రపుకొత్తూరు మండలాల్లోని మహేంద్రతనయ కాలువ వద్ద గల ప్రధాన వంతెన గోడల నుంచి ఇటుకలు జారిపోవడంతో రెండు మూడు చోట్ల రక్షణగోడలు దెబ్బతిన్నాయి. పలాస నుంచి చినబాడం మీదుగా పూండి, వజ్రపుకొత్తూరు, పర్లాకిమిడికి వెళ్లేందుకు అధిక సంఖ్యలో వాహనాలు ఈ రహదారిలో వెళ్తుంటాయి. అధికారులు స్పందించి ఈ వంతెనలపై గల రక్షణ గోడలకు మరమ్మతులు నిర్వహించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు, వాహనచోదకులు కోరుతున్నారు.