Share News

నమోదు కాదు.. సాయం అందదు

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:24 AM

58,800 farmers have opted out of 'PM Kisan' జిల్లాలో 2,79,100 మంది రైతులు ఉన్నారు. ఈ నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో రైతుకు రూ.7వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేశాయి. కాగా.. జిల్లాలో 58,800 మంది రైతులకు పీఎం కిసాన్‌ నిధులు జమకాలేదు.

నమోదు కాదు.. సాయం అందదు

  • ‘పీఎం కిసాన్‌’కు 58,800 మంది రైతులు దూరం

  • కొత్తగా దరఖాస్తుకు నోచుకోని వైనం

  • సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు

  • మెళియాపుట్టి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి):

  • మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం గ్రామానికి చెందిన గేదెల గోపాలరావుకు రెండు ఎకరాలు భూమి ఉంది. రెండేళ్ల కిందట తన తండ్రి మృతి చెందారు. కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చినా.. ‘పీఎం కిసాన్‌’, ‘అన్నదాత సుఖీభవ’ పథకాల నిధులు జమకాక గోపాలరావు ఇబ్బందులు పడుతున్నాడు. ‘అన్నదాత సుఖీభవ’ కోసం దరఖాస్తుకు అవకాశం ఇచ్చినా, పీఎం కిసాన్‌ కోసం తాము ఏమీ చేయలేమని అధికారులు చెప్పడంతో ఆందోళన చెందుతున్నాడు.

  • మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం గ్రామానికి చెందిన యెన్ని అన్నపూర్ణ భర్త శేషగిరిరావు కొన్నాళ్ల కిందట మృతిచెందాడు. ఆయన పేరున ఉన్న భూమి అంతా అన్నపూర్ణమ్మ పేరిట రాసినా.. పీఎం కిసాన్‌ డబ్బులు జమకావడం లేదు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు.

  • సోంపేట మండలం పాలవలస గ్రామానికి చెందిన గోకర్ల వరలక్ష్మికి భూమి ఉన్నా.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకాల కింద నిధులు జమకావడం లేదు. రైతు సేవా కేంద్రం, స్వర్ణగ్రామ పంచాయతీ చుట్టూ నాలుగు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరని ఆమె వాపోతోంది.

  • జిల్లాలో చాలా మంది రైతులకు ‘పీఎం కిసాన్‌’ పథకం సాయం అందడం లేదు. సాగుకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో పీఎం కిసాన్‌ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.6వేలు చొప్పున ఆర్థికసాయం అందిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రూ.14వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. కాగా.. పీఎం-కిసాన్‌ పథకానికి సంబంధించి లబ్ధిదారుల సంఖ్య ఏటా తగ్గుతోంది. ఈకేవైసీ, రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదులో వెనుకబాటుతో చాలామంది రైతులు లబ్ధి పొందలేకపోతున్నారు. మరోవైపు సాంకేతిక సమస్యలతో ఈ పథకానికి దూరమవుతున్నారు.

  • జిల్లాలో 2,79,100 మంది రైతులు ఉన్నారు. ఈ నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో రైతుకు రూ.7వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేశాయి. కాగా.. జిల్లాలో 58,800 మంది రైతులకు పీఎం కిసాన్‌ నిధులు జమకాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • 2019 ఫిబ్రవరి ఒకటో తేదీకి ముందు పట్టాదారు పాస్‌ పుస్తకం కలిగి.. ఆన్‌లైన్‌ వెబ్‌ల్యాండ్‌, అడంగళ్‌లో పేర్లు ఉన్న రైతులకే పీఎం కిసాన్‌ వర్తింపజేశారు. అప్పట్లో రెవెన్యూ సమస్యలతో పుస్తకాలు లేక.. కొత్తగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసుకున్నా, కేంద్ర ప్రభుత్వం దరఖాస్తుకు అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది రైతులు ‘పీఎం కిసాన్‌’ లబ్ధికి దూరమవుతున్నారు. వారసత్వంగా సాగుభూమి పొందినవారు, భూమి కొత్తగా కొనుగోలు చేసి మ్యూటేషన్‌ చేయించుకున్న రైతులు.. పీఎం కిసాన్‌కు సంబంధించి తాము దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు.

  • సమస్యలు సరిచేస్తున్నాం

  • అర్హులైన రైతులందరికీ పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన నిధులను జమవుతున్నాయి. ఆధార్‌, పట్టాదారు పాస్‌పుస్తకానికి లింక్‌ కాకపోవడం, తదితర సాంకేతిక సమస్యలతో కొంతమందికి నిధులు జమకాలేదు. ఇటువంటి వాటిని సరి చేస్తున్నాం. కొత్తగా ‘పీఎం కిసాన్‌’లో నమోదు కోసం దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు.

  • - జగన్మోహన్‌రావు, ఏడీ వ్యవసాయశాఖ, టెక్కలి

Updated Date - Jul 01 , 2026 | 12:24 AM