వినోదానికి విశాఖ వెళ్లాల్సిన పనిలేదు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:03 AM
వినోదం కోసం ఇకపై విశాఖ వెళ్లాల్సిన పని లేకుండా, జిల్లా కేంద్రంలోనే సకల వసతులతో ఈ పార్కును తీర్చిదిద్దామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు.
శ్రీకాకుళం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): వినోదం కోసం ఇకపై విశాఖ వెళ్లాల్సిన పని లేకుండా, జిల్లా కేంద్రంలోనే సకల వసతులతో ఈ పార్కును తీర్చిదిద్దామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. శనివారం శ్రీకాకుళం ఏపీ హెచ్‌బీ కాలనీలోకార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన చింతాడ మోహనరావు త్యాగానికి గుర్తుగా నిర్మించిన కార్గిల్ విక్టరీ పార్క్ అందుబాటులోకి వచ్చింది. సుడా ఆధ్వర్యంలో రూ.రెండు కోట్ల వ్యయంతో తీర్చిదిద్దిన ఈ పార్కును కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ కార్గిల్ పోరులో పాల్గొన్న హవల్దార్ చిన్న సింహాచలం, టొంప నీలాచలం సహా జిల్లాకు చెందిన 58 మంది యోధుల చరిత్రను నేటి తరం తెలుసుకునేలా పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అభినందనీయ మన్నారు. పార్కు నిర్మాణానికి అహర్నిశలు శ్రమించిన కలెక్టర్ జేసీని అభినందించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఇదొక పూర్తిస్థాయి యూజర్ ఫ్రెండ్లీ పార్క్ అన్నారు. ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎల్‌సీడీ ప్రాజెక్టర్, సోలార్ దీపాలు, స్ర్పింక్లర్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. పార్కులోకి ఉచిత ప్రవేశం ఉంటుందని, క్రీడా కోర్టులను వినియోగించుకునే వారి నుంచి నామమాత్రపు రుసుములతోనే పార్కు నిర్వహణ చేపడతామన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఈ పార్కు ఒక ట్రయల్ రన్ మాత్రమేనని, మరిన్ని భారీ పనులు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సుడా ఇంజనీరింగ్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
పింక్ టాయిలెట్లు ప్రారంభం
అరసవల్లి/పాత శ్రీకాకుళం, మార్చి 21(ఆంఽధ్రజ్యోతి): నగరంలోని డే అండ్ నైట్ కూడలి, ఉమెన్స్ కాలేజీ దగ్గర మహిళల కోసం ఏర్పాటు చేసిన ఫీడింగ్ రూమ్, పింక్ టాయిలెట్లను కేంద్రమంత్రి రామ్మోహన్‌యుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ప్రారంభించారు. రామలక్ష్మణ జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు సెంట్రల్ లైటింగ్‌ను కూడా ప్రారంభించారు. ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆర్‌డీఎస్‌ఎస్ నిధులతో చేపట్టే 33 కేవీ, 11 కేవీ భూగర్భ విద్యుత్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష పాల్గొన్నారు.