ఇక పల్లెల్లో ‘ప్రత్యేక’ పాలన!
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:45 PM
The term of the sarpanchs ends on April 2 పల్లెల్లో త్వరలో ప్రత్యేకాధికారుల పాలన రానుంది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. నిబంధనల ప్రకారం ఆలోపే ఎన్నికలు నిర్వహించాలి. కానీ బీసీ రిజర్వేషన్ల ఖరారు, డెడికేటెడ్ కమిషనర్ నివేదిక తదితర సాంకేతిక, న్యాయపరమైన అంశాల నేపథ్యంలో.. జూన్ తర్వాతే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఏప్రిల్ 2తో ముగుస్తున్న సర్పంచ్‌ల పదవీకాలం
జిల్లాలో 912 గ్రామాలకు ప్రత్యేకాధికారులు
జూన్ తర్వాతే పంచాయతీల ఎన్నికలు
రిజర్వేషన్ల ఖరారుకు సమయం పట్టే అవకాశం
తొలుత పరిషత్ పోరుకే కూటమి శ్రేణుల మొగ్గు
శ్రీకాకుళం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): పల్లెల్లో త్వరలో ప్రత్యేకాధికారుల పాలన రానుంది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. నిబంధనల ప్రకారం ఆలోపే ఎన్నికలు నిర్వహించాలి. కానీ బీసీ రిజర్వేషన్ల ఖరారు, డెడికేటెడ్ కమిషనర్ నివేదిక తదితర సాంకేతిక, న్యాయపరమైన అంశాల నేపథ్యంలో.. జూన్ తర్వాతే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే వరకూ గ్రామ పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జిల్లాలోని 30 మండలాల పరిధిలో మొత్తం 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో ఎంపీడీవో, ఈవోపీఆర్డీలు, తహసీల్దార్లు, ఇతర మండలస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించనున్నారు. ఒక్కో అధికారికి రెండు, మూడు లేదా ఆపైగా పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
ఆలస్యానికి కారణాలివే...
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు(ట్రిపుల్ టెస్ట్) ప్రకారం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 45 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించడానికి కనీసం మరో రెండు నెలలు పడుతుంది. వీటికితోడు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నీలం సాహ్ని పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. కొత్త ఎస్‌ఈసీగా రిటైర్డ్ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ పూర్తయ్యే సరికి జూన్ దాటే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముందు ఏ ఎన్నికలు..?
ఎన్నికల నిర్వహణపై కూటమి పార్టీల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముందుగా పార్టీ గుర్తులు లేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. గ్రామాల్లో సహజంగానే వర్గాలు ఏర్పడతాయి. ఈ వర్గపోరు ప్రభావం.. ఆ తర్వాత జరిగే మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని జిల్లా నేతలు భావిస్తున్నారు. అలాకాకుండా, ముందుగా పార్టీ గుర్తుల మీద జరిగే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే.. కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి పూర్తిస్థాయిలో స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్థానికంగా ఉన్న మండలస్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు ముందుగా పరిషత్ ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లడమే శ్రేయస్కరమని జిల్లా కూటమి ముఖ్యనేతలు సైతం భావిస్తున్నట్లు సమాచారం.
రూ. 234 కోట్లతో రోడ్ల అభివృద్ధి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ‘పల్లె పండుగ 2.0’ కింద జిల్లావ్యాప్తంగా రూ.234 కోట్ల భారీ నిధులతో పనులు చేపట్టారు. ఇందులో భాగంగా 303 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, మరో 125 కిలోమీటర్ల మేర తారు రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ పనులను మరింత వేగవంతం చేసి, గ్రామాల రూపురేఖలు మార్చిన తర్వాతే ప్రజల వద్దకు వెళితే సానుకూల ఫలితాలు ఉంటాయని, ఈ అభివృద్ధి పనులే స్థానిక ఎన్నికల్లో కూటమికి శ్రీరామరక్షగా నిలుస్తాయని అధికార పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.