ధర ఉన్నా.. తీరని చింత
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:22 AM
Reduced tamarind yield చింతపండు సేకరించే గిరిజన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కిలో చింతపండును రూ.55కి కొనుగోలు చేయనున్నట్లు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వెల్లడించింది. కాగా ప్రస్తుతం ధర ఉన్నా.. ఆశించిన స్థాయిలో దిగుబడి లేక రైతులు నిరాశ చెందుతున్నారు.
తగ్గిన చింతపండు దిగుబడి
వ్యాపారుల జోక్యంతో మరింత నష్టం
ఆందోళనలో గిరిజన రైతులు
మెళియాపుట్టి/ పాతపట్నం రూరల్/ పలాస రూరల్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి):
చింతపండు సేకరించే గిరిజన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గిరిజన రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల ప్రభుత్వం కిలో చింతపండు ధరను రూ.36 నుంచి రూ.45కు పెంచింది. అయితే బహిరంగ మార్కెట్‌లో ధర, పంట దిగుబడి ఇతర పరిస్థితుల రీత్యా.. అదనంగా మరో రూ.10 పెంచుతూ ఇకపై కిలో చింతపండును రూ.55కి కొనుగోలు చేయనున్నట్లు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వెల్లడించింది. కాగా ప్రస్తుతం ధర ఉన్నా.. ఆశించిన స్థాయిలో దిగుబడి లేక రైతులు నిరాశ చెందుతున్నారు.
జిల్లాలో 1,15,892 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. మెళియాపుట్టి, నందిగాం, మందస పాతపట్నం, కోత్తూరు, హిరమండలం, పలాస, టెక్కలి మండలాల్లో చింతచెట్లు అధికంగా ఉన్నాయి. పలాస మండలం పొత్రియ, బాపనూరు, గట్టూరు, కొఠారింగి తాళభద్ర తదితర గిరిజన గ్రామాల్లో రైతులు చింత పంటపైనే ఆధారపడుతుంటారు. తితలీ తుఫాన్ సమయంలో చాలా చెట్లు నేలకొరిగాయి. అలాగే గతేడాది దసరా నుంచి ఇప్పటివరకూ సరైన వర్షాలు లేక ఆశించిన స్థాయిలో చింత పంట దిగుబడి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో మెట్టభూముల్లో సైతం చింతచెట్లు పెంచినా.. అక్కడా దిగుబడి అంతంతమాత్రమే. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు చింతపండు ఎగుమతి అయ్యేది. కానీ ఈ ఏడాది జిల్లాలో దిగుబడి లేక.. ఒడిశా నుంచి ఇక్కడకు చింతపండు దిగుమతి అవుతోంది. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలోని జిరాంగో, లంజిభద్ర గ్రామాలతోపాటు కాశీనగర్, గురండి, గుసాని ప్రాంతాల నుంచి చింతపండు తెచ్చి.. సంతలు, మార్కెట్‌లో కిలో రూ.65 నుంచి రూ.75 వరకు విక్రయిస్తున్నారు.
వ్యాపారుల జోక్యంతో నష్టం
చింతపండు ధర అటు మార్కెట్‌లో.. ఇటు జీసీసీలో ఆశాజనకంగా ఉన్నా.. వ్యాపారుల జోక్యంతో గిరిజన రైతులకు నష్టం వాటిల్లుతోంది. అసలుకే పంట దిగుబడి లేకపోగా.. ఉన్న పంటను కూడా దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సరైన కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, సమాచారం లోపించడం వలన వ్యాపారులపై ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా వారు కిలో రూ.40కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ ఈ ఏడాది చింతపండు కొనుగోలు ధరను పెంచినప్పటికీ గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాలు సరిగా పని చేయకపోవడం వలన గిరిజనులకు ఆ లాభం అందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని, ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉందని గిరిజనులు వాపోతున్నారు. కొంతమంది వ్యాపారులు గతేడాది కోల్డ్‌స్టోరేజ్‌ల్లో నిల్వ ఉంచిన చింతపండును ప్రస్తుతం కిలో రూ.80 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అటు రైతులకు నష్టం, ఇటు వినియోగదారులకు భారం ఉండగా.. వ్యాపారులకు మాత్రం చింతపండు ధర కలిసొచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి జీసీసీ కొనుగోలు కేంద్రాలను గ్రామస్థాయిలో ఏర్పాటు చేసి.. అవగాహన కల్పిస్తే గిరిజనులు నష్టపోకుండా ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దిగుబడి లేక కొనుగోలు లేదు
ఈ ఏడాది ఇంతవరకు ఒక కిలో కూడా చింతపండును కొనుగోలు చేయలేదు. ఈ ఏడాది ప్రభుత్వం కిలో చింతపండుకు మద్దతు ధర రూ.55 చొప్పున ప్రకటించింది. కాగా దిగుబడి లేక గిరిజన రైతులు పంటను విక్రయించలేకపోతున్నామని చెబుతున్నారు.
- నరసింహరావు, జీసీసీ మేనేజర్, పాతపట్నం