లైన్లు లేవు.. మీటర్లు రావు
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:13 AM
Waiting for agricultural electricity connections వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పడతాయని వ్యవసాయశాఖ, వాతావరణ శాఖ అధికారులు కొన్నాళ్ల ముందు నుంచే హెచ్చరిస్తున్నారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూపు
పట్టించుకోని అధికారులు
రైతులకు తప్పని ఇబ్బందులు
మెళియాపుట్టి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి)
మెళియాపుట్టి మండలం జలగలింగుపురం గ్రామానికి చెందిన నడిమింటి శ్రీరాములు అనే రైతు ఐదు నెలల కిందట వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేశాడు. ఆ రైతు ఇటీవల మృతి చెందాడు. అయినా ఇంతవరకు విద్యుత్ కనెక్షన్ మంజూరు కాలేదు.
టెక్కలి మండల నంబాళ్లపేట గ్రామానికి చెందిన నంబాళ్ల జగన్ అనే రైతుకు కుడ్డబ రెవెన్యూ పరిధిలో మూడు ఎకరాల భూమి ఉంది. అక్కడ డ్రాగన్‌ఫ్రూట్స్ పండిస్తున్నారు. సాగు నిమిత్తం విద్యుత్ కనెక్షన్ కోసం ఆరు నెలల కిందట దరఖాస్తు చేశారు. కానీ ఇంతవరకూ మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
టెక్కలి మండల శ్యామసుందరాపురం గ్రామానికి చెందిన ఉప్పాడ సురేష్ కుమార్.. కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకోగా.. ఆ శాఖ అధికారులు రూ.80వేలు డిమాండ్ చేశారు. దీనిపై ఏపీఈపీడీసీఎల్ సీఎమ్‌డీకి ఫిర్యాదు చేరడంతో విద్యుత్‌శాఖలో కలకలం రేగింది.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పడతాయని వ్యవసాయశాఖ, వాతావరణ శాఖ అధికారులు కొన్నాళ్ల ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు సాగునీటి అవసరాల కోసం అనువైన ప్రాంతాల్లో బోర్లు తీశారు. వాటికి విద్యుత్ కనెక్షన్ల కోసం మార్చిలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినా.. అధికారులు ఇంతవరకూ విద్యుత్ లైన్లు వేయలేదు. మీటర్లు కూడా అమర్చకపోవడంతో రైతులకు నిరాశ తప్పడం లేదు. కొంతమంది ఇంజన్ల ద్వారా సాగునీటిని అందించి పంటలను కాపాడుకుంటున్నారు. డీజిల్ ఖర్చు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నా వినియోగించుకోలేక పోతున్నామని వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి:
జిల్లాలో 33,830 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏడాది 1,278 మంది రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా టెక్కలి డివిజన్‌లో 553 దరఖాస్తులు వచ్చాయి. శ్రీకాకుళం డివిజన్‌లో 433, పలాసలో 292 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. గతేడాదికి సంబంధించి సుమారు 400 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా 1,678 దరఖాస్తులకుగానూ ఇప్పటివరకూ 1,067 కనెక్షన్లు మంజూరు చేశారు. 611 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా విద్యుత్‌శాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్లు ఇచ్చినవారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సీఎమ్‌డీకి ఫిర్యాదులు అందుతున్నా.. చర్యలు లేకపోవడంతో విద్యుత్‌శాఖ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
మెట్ట ప్రాంతాల్లో ఇబ్బంది
జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో రైతులు.. వర్షాలు లేక ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపుతున్నారు. కానీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు లేక.. సాగుకోసం ఇబ్బందులు పడుతున్నారు. నందిగాం, టెక్కలి, పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తరు, హిరమండలం, బూర్జ, సరుబుజ్జలి, ఎల్‌ఎన్‌పేట, జలుమురు, సారవకోట, నరసన్నపేట, పొందూరు, జి.సిగడాం, లావేరు తదితర ప్రాంతాల్లో రైతులు మోటార్లతో సమీప చెరువులు, బావుల్లో నీటిని తోడి పైపుల ద్వారా పంటలకు అందిస్తున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ లైన్లు వేసి.. కనెక్షన్లు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఈ విషయమై మెళియాపుట్టి విద్యుతశాఖ ఏఈ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. ‘కొత్తలైన్లు వేయడానికి ఇంతవరకూ వైర్లు, విద్యుత్ పరికరాలు ఇటీవల వచ్చారు. అవకాశం ఉన్నచోట లైన్లు వేస్తాం. పనులు ప్రారంభించి సమస్య పరిష్కరిస్తామ’ని తెలిపారు.