Share News

‘హానికర పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదు’

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:00 AM

తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికర పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదని రైతులు, మత్స్యకారులు తేల్చిచెప్పారు.

 ‘హానికర పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదు’
మాట్లాడుతున్న ఆర్డీవో కృష్ణమూర్తి

సంతబొమ్మాళి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికర పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదని రైతులు, మత్స్యకారులు తేల్చిచెప్పారు. మండలంలోని వడ్డితాండ్ర సచివాలయం వద్ద శనివారం కెమికల్‌ పార్క్‌ కోసం భూసేకరణపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, మత్స్యకారులు తమ అభ్యంతరాలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. కెమికల్‌ పార్క్‌ ఏర్పాటైతే తమ జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల వల్ల పర్యావరణం, సముద్రంపై ప్రభావం, జీవనోపాధికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితుల్లో భూములు ఇచ్చేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చే ఇతర పరిశ్రమలు ఏర్పాటైతే తమ అభిప్రాయాన్ని పరిశీలిస్తామని మరికొంతమంది రైతులు తెలిపారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే భూసేకరణపై ముందుకు వెళ్లాలని కోరారు. కెమికల్‌ పార్క్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు సుమారు 3వేల ఎకరాలు అవసరమని అధికారులు గ్రామసభలో తెలిపారు. వడ్డితాండ్ర రెవెన్యూ పరిధిలో 500 ఎకరాలను సేకరించేందుకు చర్యలు చేపడుతున్నామని టెక్కలి ఆర్డీవో ఆర్డీవో కృష్ణమూర్తి అన్నారు. అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ గ్రామసభలో తహసీల్దార్‌ హేమసుందరావు, రెవెన్యూ అధికారులు, రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:00 AM