పంచాయతీ ఎన్నికల్లో చట్ట వ్యతిరేక పనులు వద్దు
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:54 PM
పంచాయతీ ఎన్నికల్లో చట్ట వ్యతిరేక పనులు చేపట్టవద్దని కాశీబుగ్గ డీఎస్పీ జీవీ రమణ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణలో పలాస మండలంలో ఉన్న పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.
పలాస, నవంబరు 23(ఆంధ్ర జ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో చట్ట వ్యతిరేక పనులు చేపట్టవద్దని కాశీబుగ్గ డీఎస్పీ జీవీ రమణ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణలో పలాస మండలంలో ఉన్న పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని స్పష్టం చేశారు. దీన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టవద్దని, మద్యం, ఇతర బహుమతులు పంపిణీ చేసి పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బలవంతంగా ఓట్లు వేయించుకోవడం, ఇతర అభ్యర్థులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, తప్పుడు ప్రచారాలు చేయడం నేరమన్నారు. ఎన్నికల ప్రచారాలకు సంబంధించి ర్యాలీలు, ఊరేగింపులు, సభలు నిర్వహిండానికి అనుమతులు తీసుకోవాలని సూచించారుఉ. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటును వినియోగించడానికి అభ్యర్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ అప్పారావు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
ఫ వజ్రపుకొత్తూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహరించాలని కాశీబుగ్గ డీఎస్పీ జీవీరమణ పేర్కొన్నారు. సోమవారం వజ్రపుకొత్తూరు పోలీసుస్టేషన్ ఆవరణలో సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలన్నారు. ఎటువంటి అల్లర్లు, తగదాలకు తావివ్వవద్దన్నారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో కాశీబుగ్గ సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐలు సిద్థార్థ్ కుమార్, నిహార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ పలాస రూరల్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రజలు సహకరించాలని డీఎస్సీ జీవీ.రమణ అన్నారు. పలాస మండలం గరుడఖండి గ్రామంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎం.అప్పారావు, పోలీసు అధికారులు, గ్రామపెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.