Share News

‘తల’కెక్కించుకోవట్లే!

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:19 AM

65% of accidents occur due to not wearing a helmet జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా చాలామంది వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడంతో ప్రమాదాల సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు. 2024 నుంచి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 570 మంది మృతిచెందడం బాధాకరం.

‘తల’కెక్కించుకోవట్లే!

  • హెల్మెట్‌ ధరించక 65 శాతం ప్రమాదాలు

  • మూల్యం చెల్లించుకుంటున్న వాహనాదారులు

  • కేసులు నమోదు చేస్తున్నా తగ్గని వైనం

  • ఇచ్ఛాపురం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి):

  • గత ఏడాది ఇచ్ఛాపురం పట్ట్టణ పరిధి సంతపేట జంక్షన్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. అలాగే ఇండియన్‌ గ్యాస్‌ ఏజన్సీ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బలరాంపేటకు చెందిన 24 ఏళ్ల యువకుడు మృత్యువాత పడ్డాడు.

  • రెండు నెలల కిందట ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. హెల్మెట్‌ ధరించకపోవడంతోనే ఆయన మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదం మిగిల్చాడు.

  • మూడు నెలల కిందట కంచిలి మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. హెల్మెట్‌ ధరించకపోవడంతో తల రహదారికి తగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

  • ఈ నెల 13న సంతబొమ్మాళి మండలం రాజగోపాలపురం గ్రామానికి చెందిన జడ్యాడ అనసూయమ్మ(55).. తన కుమారుడు ఉమాపతి రాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై పలాస ఆసుపత్రికి వెళ్లింది. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా నందిగాం వల్లయికానా సమీపంలో వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్‌ బస్సు బైక్‌ను బలంగా ఢీకొంది. దీంతో బైక్‌ వెనుక కూర్చున్న అనసూయమ్మ కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. బైక్‌ నడుపుతున్న ఉమాపతిరావుకు కుడిచేయి విరిగింది.

  • ఇలా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా చాలామంది వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడంతో ప్రమాదాల సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు. 2024 నుంచి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 570 మంది మృతిచెందడం బాధాకరం. అందులో 268 మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘హెల్మెట్‌ ధరించండి.. సురక్షితంగా ప్రయాణించండి’ అని ట్రాఫిక్‌ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలామంది వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4.33 లక్షల మంది వాహనదారులు ఉండగా 65శాతం మంది హెల్మెట్‌ ధరించడం లేదు. కేవలం 35శాతం మంది మాత్రమే హెల్మెట్‌ ధరిస్తున్నారని పోలీసు శాఖ గుర్తించింది.

  • ఇదీ పరిస్థితి..

  • జిల్లాలో 2024లో 887 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 279 మంది మృత్యువాత చెందారు. 114మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే చనిపోయారు. 2025లో 702 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 243 మంది మృత్యువాత చెందారు. 120 మంది హెల్మెట్‌ లేకపోవడం వల్లే చనిపోయారు. ఈ ఏడాదికి సంబంధించి గత నాలుగు నెలల్లో 241 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 48 మంది చనిపోతే అందులో 34 మంది హెల్మెట్‌ లేకపోవడంతోనే మృత్యువాత చెందారని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల నడవడికపై దృష్టి సారించడం లేదు. సాధారణంగా ద్విచక్ర వాహనం ప్రతి ఇంటికి అవసరమే. కానీ పిల్లలు కోరిందే తడవుగా స్పోర్ట్స్‌ బైక్‌లు కొనిచ్చేస్తున్నారు. ఇలా బైక్‌లు సమకూర్చిన తరువాత చాలామంది పిల్లలపై దుష్ట్రభావం పడుతోంది. చెడు వ్యసనాలు తోడవుతున్నాయి. బైక్‌ రేసింగ్‌, మందు తాగి డ్రైవింగ్‌ చేయడం వంటి వాటితో వారు మూల్యం చెల్లించుకుంటున్నారు.

  • కోర్టు స్పష్టమైన ఆదేశాలు...

  • గత ఏడాది మార్చి 1నుంచి హెల్మెట్‌ ధారణకు సంబంధించి కోర్టు కీలక ఆదేశాలతో కఠిన నిబంధనలు, జరిమానాలు అమల్లోకి వచ్చాయి. అయినా సరే వాహనదారుల్లో మార్పురావడం లేదు. గతేడాది మార్చి1 కంటే ముందు హెల్మెట్‌ లేకుండా ప్రయాణానికి సంబంధించి రూ.135 జరిమానా వేసేవారు. కానీ మారిన నిబంధనలతో రూ.1000 కట్టాల్సిందే. లైసెన్స్‌ లేకుండా బండి నడిపితే రూ.10వేలు వసూలు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా శాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగితే కేసులు నమోదు చేస్తారు. 90 రోజుల్లో జరిమానా కట్టకపోతే బండి సీజ్‌ చేస్తారు.

  • హెల్మెట్‌ లేకుంటే రూ.1000, వాహనానికి ఇన్సూరెన్స్‌ లేకపోతే రూ.1000, రెండోసారి పట్టుబడితే రూ.2000, భారీ సైలెన్సర్లతో సౌండ్‌ పొల్యూషన్‌కు పాల్పడితే రూ.2000, అదే రెండోసారి దొరికితే రూ.4000, పరిమితికి మించి వాహనాల్లో ఎక్కించుకుంటే మనిషికి రూ.200 లెక్క జరిమానా విధిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్‌ చేసి పట్టుబడితే రూ.1000, నిషేధం ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్‌ చేస్తే రూ.1500 నుంచి రూ.2000, బైక్‌ రేసుల్లో పాల్గొంటే రూ.5000, రెండోసారి అందులో దొరికితే రూ.10000, తాగి వాహనం నడిపితే మూడు నెలల జైలు శిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం మార్పు రావడంలేదు.

    స్కూటీపై ఆరుగురు : చేతులు జోడించి వారించిన కానిస్టేబుల్‌

    పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా.. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పోలాకి మండలం సుసరాం వద్ద ఓ వ్యక్తి.. హెల్మెట్‌ ధరించకుండా.. స్కూటీపై మరో ఐదుగురితో కలిసి ప్రయాణం సాగించాడు. పోలాకి కానిస్టేబుల్‌ ఆ వాహనాన్ని నిలుపుదల చేశారు. ఇద్దరికే పరిమితమైన ద్విచక్రవాహనంపై హెల్మెట్‌ ధరించకుండా ఆరుగురు ప్రయాణించడం ప్రమాదం కాదా? అని వాహనదారుడ్ని ప్రశ్నించారు. అత్యవసర పనిమీద వెళ్లాల్సి వచ్చిందని వాహనదారుడు చెప్పగా.. ఇలా ప్రయాణించడం నిబంధనలకు వ్యతిరేకమని కానిస్టేబుల్‌ పేర్కొన్నారు. ‘హెల్మెట్‌ ధరించండి.. ప్రమాదాలు నివారించండి’ అని చేతులు జోడించి సూచించారు. ఇకపై ఇలా ప్రయాణించరాదని స్పష్టం చేశారు.

    నిబంధనలు పాటించాలి

  • ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు హెల్మెట్లు, కార్లలో వెళ్లేవారు షీటు బెల్టు తప్పకుండా పెట్టుకోవాలి. నిబంధనలు పాటించకపోతే మాత్రం భారీ జరిమానాలు, జైలుశిక్ష తప్పదు. ప్రజల బాగుకోసమే ఈ ప్రయత్నం. అందుకే ప్రజలు సహకరించాలి. ట్రాఫిక్‌ నిబందనలు పాటించాలి.

  • - చిన్నంనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం

Updated Date - Jun 18 , 2026 | 12:19 AM