పాలకవర్గ సమావేశం లేక.. నాలుగేళ్లు
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:08 AM
ITDA's misguided governance గిరిజనాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సీతంపేట ఐటీడీఏలో పాలకవర్గ సమావేశాలు నాలుగేళ్లుగా నిర్వహించడం లేదు. ప్రతి మూడు నెలలకోసారి ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశాల్లో ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించాలి.
ఇన్‌చార్జి పీవో పాలనతో గాడి తప్పిన ఐటీడీఏ
నిధులు మంజూరవుతున్నా.. నిష్ప్రయోజనమే
అభివృద్ధి పనులపై కానరాని పర్యవేక్షణ
గిరిజన గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు
సీతంపేట ఐటీడీఏ పాలన గాడి తప్పుతోంది. నాలుగేళ్లుగా పాలకవర్గం సమావేశం నిర్వహించకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న ఈ ఐటీడీఏకు చైర్మన్ ఎవరో తెలియని దుస్థితి నెలకొంది. రెగ్యులర్ పీవో కూడా లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి.
మెళియాపుట్టి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): గిరిజనాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సీతంపేట ఐటీడీఏలో పాలకవర్గ సమావేశాలు నాలుగేళ్లుగా నిర్వహించడం లేదు. ప్రతి మూడు నెలలకోసారి ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశాల్లో ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించాలి. గిరిజన సమస్యలను పరిష్కరించాలి. కాగా వైసీపీ ప్రభుత్వ పాలనలో 2022లో జనవరి 29న అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి అధ్యక్షతన 77వ పాలకమండలి సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి నాలుగేళ్లు పూర్తయినా.. నేటికీ సమావేశం నిర్వహించకపోవడం గమనార్హం. రెగ్యులర్ పీవో లేకపోవడమే ఇందుకు కారణం. పాలకవర్గ సమావేశాలు నిర్వహించక పోవడంతో అధికారులు సైతం సమస్యలు తెలుసుకునే అవకాశం లేకపోతోంది. ఇన్‌చార్జిలతో కాలం నెట్టుకొస్తుండడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి
ఉమ్మడి జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 మండలాలు ఉండేవి. వైసీపీ హయాంలో జిల్లా పునర్విభజనలో భాగంగా పాలకొండ నియోజకవర్గాన్ని.. కొత్తగా ఏర్పాటు చేసిన పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న సీతంపేట ఐటీడీఏ అటు ఆ జిల్లాకు.. ఇటు శ్రీకాకుళం జిల్లా పరిధిలో కొనసాగుతోంది. ఐటీడీఏ పరిధిలోని 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలో, మరో నాలుగు మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాయి. అప్పట్లో ఐటీడీఏ పీవోగా కల్పనకుమారి ఉండేవారు. ఎన్నికల ముందు బదిలీ అయ్యారు. ప్రస్తుత కూటమి పాలనలో రెగ్యులర్ పీవోలు లేరు. ఇన్‌చార్జి పీవోగా పాలకొండ సబ్‌కలెక్టర్‌గా గతంలో పనిచేసిన యశ్వంత్ కుమార్ పనిచేశారు. ప్రస్తుతం పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఇన్‌చార్జి పీవోగా వ్యవహరిస్తున్నారు. అలాగే సీతంపేట ఐటీడీఏ.. ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండడంతో ఏ జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారో తెలియక అధికారుల్లో సైతం గందరగోళం కనిపిస్తోంది. దీంతో పాలనపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో ఐటీడీఏకు వచ్చిన సబ్‌ప్లాన్ నిధులను కార్పొరేషన్లకు మళ్లించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నా.. నిధులు సక్రమంగా ఖర్చవుతున్నాయో.. లేదో పర్యవేక్షించే నాథులు కరువయ్యారు.
సీతంపేట ఐటీడీఏ పరిధిలో 672 గిరిజన గ్రామాల్లో 93,877 మంది గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. కనీస వసతులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. 145 గిరిజన గ్రామాల్లో రహదారులు సక్రమంగా లేవని అధికారులు గుర్తించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సుమారు రూ.51 కోట్లు నిధులు మంజూరు చేసి.. రహదారి పనులు చేపడుతోంది. కాగా వీటిని పర్యవేక్షించేవారు లేక ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి.
గురుకులాల బాధ్యత కూడా ఐటీడీఏదే. కాగా చాలా గిరిజన వసతిగృహాల్లో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు గాడి తప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల బందపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు రెండువర్గాలుగా వీడి రచ్చకెక్కారు. దీంతో అక్కడ పనిచేసిన సిబ్బందికి డిప్యుటేషన్‌పై పంపించేశారు. పీవోల పర్యవేక్షణ లేక ఎక్కడా మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ పాలనలో ఉన్న సిబ్బందే కొనసాగుతూ.. అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సిబ్బందిని వెనుకేసుకు వస్తున్నారంటూ ఇద్దరు ఉన్నతాధికారులపై గిరిజన సంఘాల నాయకులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఐటీడీఏపై పీవో పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో అవకతవకలు జరుగుతున్నాయని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఐటీడీఏకు రెగ్యులర్ పీవోను నియమించాలని, సక్రమంగా పాలన సాగేలా గిరిజనాభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
రెగ్యులర్ పీవోను నియమించాలి
వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులకు అన్యాయం జరిగింది. కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. అభివృద్ధి పనులు చేపడుతోంది. కానీ, పర్యవేక్షణ కొరవడుతోంది. రెగ్యులర్ పీవోను నియమించాలి. మెళియాపుట్టిలో ఏర్పాటు చేయనున్న ఐటీడీఏలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బందిని నియమించి.. పాలన సాగిస్తే గిరిజనులకు మేలు జరుగుతుంది.
- బైరిశింగి లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ, మెళియాపుట్టి
తప్పుదోవ పట్టిస్తున్నారు
వైసీపీ ప్రభుత్వం ఉన్ననాటి నుంచి కొంతమంది సిబ్బంది సీతంపేట ఐటీడీఏను వదలడం లేదు. దీన్నితో ఇన్‌చార్జి పీవోలు వారిపైనే ఆధారపడుతున్నారు. కిందస్థాయిలో జరుగుతున్న విషయాలను తెలుసుకోలేక పోతున్నారు. దీంతో పాలన సక్రమంగా సాగక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.
- చల్లా శాంతారావు, గిరిజన సంఘం నాయకుడు, మెళియాపుట్టి