నిధులూ రావు.. పనులూ జరగవు!
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:01 AM
Irrigation canals in poor condition in Patapatnam పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని సాగునీటి కాలువలు, చెక్‌డ్యాంలు అధ్వానంగా ఉన్నాయి. పూడికలు, పిచ్చి మొక్కలతో కాలువలు నిండిపోవడంతో సాగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది.
పాతపట్నంలో అధ్వానంగా సాగునీటి కాలువలు
పూడిక, పిచ్చిమొక్కలతో దర్శనం
పలుచోట్ల గండ్లు
ఆధునికీకరణ ఊసే లేదు
ప్రతిపాదనలకే పరిమితమవుతున్న అధికారులు
పాతపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని సాగునీటి కాలువలు, చెక్‌డ్యాంలు అధ్వానంగా ఉన్నాయి. పూడికలు, పిచ్చి మొక్కలతో కాలువలు నిండిపోవడంతో సాగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. దీంతో సకాలంలో వరి నాట్లు పడడం లేదు. కొన్నిచోట్ల గండ్లు పడి పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రతి ఏటా ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు నానా పాట్లు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కాలువల నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో కూటమి ప్రభుత్వంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా పనులు మాత్రం జరగకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రతి ఏటా ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు మాత్రం మంజూరు కావడం లేదు. ఫలితంగా కాలువలు ఆధునికీకరణకు నోచుకోవడం లేదు.
ప్రతి ఏటా ఇబ్బందులే..
పాతపట్నంలో గుమ్మ గెడ్డ, పొగడవిల్లి గెడ్డ ప్రధాన సాగునీటి వనరులు. గుమ్మగెడ్డ ఒడిశా నుంచి వస్తుంది. ఇది ఏఎస్‌కవిటి వద్ద ఆంధ్రాలో ప్రవేశిస్తుంది. పాతపట్నం మండల వ్యాప్తంగా సుమారు 13 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది. దీనిద్వారా ఏఎస్‌కవిటి, చాకిపల్లి, పాతపట్నం, బూరగాం, కాగువాడ, కొరసవాడ, సీది, తామర, తీమర, పాసిగంగుపేట, రొంపివలస, రొమదళ, రౌతులక్ష్మీపురం తదితర పంచాయతీల్లోని 1200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే, కాలువ అధ్వానంగా ఉండడంతో సాగునీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ఒడిశాలోని ఎగువభాగంలో అధికవర్షాలు కురిస్తే గుమ్మ గెడ్డకు వరద పోటెత్తుతుంది. దీంతో ఎక్కడికక్కడే గండ్లు పడి పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. సంవత్సరాలుగా కాలువ ఆధునికీకరణకు నోచుకోవడం లేదని రైతులు అంటున్నారు.
పొగడవిల్లి గెడ్డ పాతపట్నం మండల వ్యాప్తంగా సుమారు 9 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది. దీనికి సుమారు 900 ఎకరాల వరకూ ఆయకట్టు ఉంది. తూర్పుభాగంలో ఉన్న కొండల నుంచి వచ్చే నీటిలో కొంతభాగం పొగడవిల్లి గెడ్డ ద్వారా తెంబూరులోని అసర్లసాగరంలో కలుస్తుంది. మిగతాభాగం హిరమండలం మండల పరిధిలోని ధనుపురం మీదుగా వంశధారనదిలో కలుస్తుంది. అసర్లసాగరం ద్వారా టెక్కలి, సారవకోట మండలాల పరిధిలోని పంట పొలాలకు సాగునీరు అందుతుంది. ధనుపురం మీదుగా వెళ్లే నీరు హిరమండలంలోని అనేక గ్రామాలకు ఎక్కువగా ఉపయోపగపడుతుంది. ప్రతిఏటా వర్షాకాలంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. అయితే, కొండ దిగువకు నీరు చేరేసరికి ఆ ఉధృతికి కాలువకు గండ్లు పడి పాతపట్నం మండపరిధిలోని బి.గోపాలపురం మొదలుకొని గంగువాడ, సింగుపురం, పెద్దలోగిడి, చిన్నలోగిడి వరకూ ఉండే పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. కాలువలో పిచ్చిమొక్కలు, పూడుక పేరుకుపోవడంతో ఎక్కడికక్కడే గండ్లు పడుతున్నాయని, అధికారులకు సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ఈ రెండు కాలువలను బాగు చేయాలని కోరుతున్నారు.
గండ్లు పూడ్చాలి
గుమ్మగెడ్డపై గండ్లు పూడ్చకపోతే రైతులకు ఇబ్బందులు తప్పవు. ఈ గండ్లుతో పంట పొలాలు ముంపునకు రైతులకు తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అధికారులు, పాలకులు స్పందించి ఈ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- మార్కండేయులు, సర్పంచ్, ఏఎస్‌కవిటి.
ప్రభుత్వం దృష్టి సారించాలి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క తట్ట మన్ను పని కూడా జరగలేదు. ఇది నిజం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రహదారులపై దృష్టి పెట్టింది. వీటితో పాటు రైతాంగ సమస్యలపై కూడా దృష్టిసారిస్తే మంచిది. పొగడవిల్లి గెడ్డ పనులు చేపట్టాలి. పాలకులు, అధికారులు చొరవచూపి ఈ వేసవిలోనే పనులు పూర్తి చేయాలి.
- ఎద్దు భాస్కరరావు, రైతు, పెద్దలోగిడి
ప్రతిపాదనలు పంపాం
గుమ్మగెడ్డ గండ్లును పూడ్చేందుకు రూ.1.20కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. పొగడవిల్లి గెడ్డ అభివృద్ధికి రూ.70లక్షలతో ప్రతిపాదనలు పంపాం. నిధుల కోసం ఎదురుచూస్తున్నాం.
-జీవీ రమణ, జేఈ, ఇరిగేషన్, పాతపట్నం