Share News

పెట్రోల్‌, డీజిల్‌పై అసత్య ప్రచారాలు వద్దు

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:36 AM

There is no shortage of petrol and diesel ‘జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై అసత్య ప్రచారాలు మానుకోవాలి. ఇటువంటి వాటిని నమ్మొద్దు’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

పెట్రోల్‌, డీజిల్‌పై అసత్య ప్రచారాలు వద్దు
శ్రీకాకుళం: పెట్రోల్‌ బంక్‌ వద్ద వాహనదారుడితో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌

జిల్లాలో ఎక్కడా కొరత లేదు

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌/నరసన్నపేట, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై అసత్య ప్రచారాలు మానుకోవాలి. ఇటువంటి వాటిని నమ్మొద్దు’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళంలోని సూర్యమహల్‌, రైతుబజారు, డేఅండ్‌నైట్‌ జంక్షన్‌లోని పెట్రోల్‌ బంకులను ఆయన తనిఖీ చేశారు. నరసన్నపేటలోని రెండు పెట్రోల్‌ బంకుల్లో నిల్వలు కూడా పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకు పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు చేపట్టాలి. పెద్ద మొత్తాల్లో వాహనదారులకు విక్రయించరాదు. పెట్రోల్‌ బంకుల్లో కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవ’ని యాజమానులకు హెచ్చరించారు. అనంతరం వాహనదారులతో మాట్లాడుతూ.. జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ‘కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశాం. పెట్రోలు బంకుల వద్ద వీఆర్వో, పోలీసు, ఒక ప్రత్యేక అధికారిని నియమించాం. మత్స్యకారులు, రైతులకు సచివాలయాల అసిస్టెంట్లు కూపన్లు జారీ చేస్తార’ని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్య, తహసీల్దార్‌ టి.సత్యనారాయణ, పౌరసరఫరాలశాఖ డీటీ రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 12:36 AM