పరికరాలున్నా.. సిబ్బంది లేరు
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:33 AM
Physiotherapy services provided by just four people శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో(జీజీహెచ్- రిమ్స్) ఫిజియోథెరపీ కేంద్రంలో పరికరాలు ఉన్నా.. సిబ్బంది పూర్తిస్థాయిలో లేక సేవలు సక్రమంగా అందడం లేదు.
జీజీహెచ్ ఫిజియోథెరపీ కేంద్రంలో నలుగురితోనే సేవలు
బాధితులకు తప్పని ఇబ్బందులు
అరసవల్లి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో(జీజీహెచ్- రిమ్స్) ఫిజియోథెరపీ కేంద్రంలో పరికరాలు ఉన్నా.. సిబ్బంది పూర్తిస్థాయిలో లేక సేవలు సక్రమంగా అందడం లేదు. రిమ్స్‌కు రోజూ వందలాది మంది అనారోగ్యంతో బాధపడేవారు చికిత్స కోసం వస్తుంటారు. ఎముకలు, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడేవారు.. పక్షవాతానికి గురైనవారు తదితర బాధితులు ఫిజియోథెరపీ చేయించుకునేందుకు రోజుకు సుమారు 120 నుంచి 150 మంది వరకు వస్తుంటారు. కొన్నాళ్ల కిందట సరైన పరికరాలు లేక బాధితులు ఇబ్బందులు పడేవారు. ఈ ఏడాది మే 20 నుంచి ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చినా.. ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉండడంతో అరకొరగానే సేవలు అందుతున్నాయి. ఎస్‌డబ్ల్యూడీ, టెన్స్, ట్రాక్షన్ మిషన్, క్యూ-టేబుల్, వాక్స్ థెరపీ మిషన్, అల్ర్టాసౌండ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని వినియోగించేందుకు అవసరమైన సహాయకులను నియమించడం లేదు. దీంతో పరికరాలు వృథాగా ఉన్నాయి. ఇద్దరు ఫిజియోథెరపిస్ట్‌లు, ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఎవరైనా ఒకరు సెలవు పెడితే బాధితుల పరిస్థితి వర్ణణాతీతం. సిబ్బందికి కూడా గత 15 నెలల నుంచి జీతాలు అందని పరిస్థితి నెలకొంది.
చిన్నపాటి వర్షానికే నీటిచెమ్మ
చిన్నపాటి వర్షం కురిసినా సరే.. ఫిజియోథెరపీ కేంద్రంలో గోడలకు నీటి చెమ్మ ఏర్పడి బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే స్త్రీలకు సంబంధించి కొన్ని రకాల చికిత్సలకు ప్రత్యేక గది లేక సేవలకు ఆటంకం కలుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి సక్రమంగా ‘ఫిజియోథెరపీ’ సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
ఈ విషయమై జీజీహెచ్ ఆర్థో, ఫిజియోథెరపీ విభాగాధిపతి డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్ వద్ద ప్రస్తావించగా.. ‘ఫిజియోథెరఫీ విభాగంలో సిబ్బంది కొరత వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే బాధితులకు సేవలు అందిస్తున్నారు. త్వరలో అదనపు సహాయకులను నియమించి.. మరింత మెరుగైన సేవలు అందజేస్తామ’ని తెలిపారు.