Share News

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:45 PM

Inter exams from tomorrow ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో సీసీ కెమెరాల నిఘా నడుమ.. పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కాగా.. అరగంట ముందుగానే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

నిఘా నడుమ నిర్వహణకు ఏర్పాట్లు

నరసన్నపేట, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో సీసీ కెమెరాల నిఘా నడుమ.. పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కాగా.. అరగంట ముందుగానే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐవో సురేష్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

71 కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు మొత్తం 39,847 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరికోసం 71 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 71మంది చీఫ్‌లు, 71 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులతోపాటు 1,068 మంది ఇన్విజలేటర్లను నియమించారు. శ్రీకాకుళం ఆర్‌ఐవో కార్యాలయం, విజయవాడలోని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రధాన కార్యాలయానికి సీసీ కెమెరాలు అనుసంధానం చేశారు. ఆ కార్యాలయాలు నుంచి పరీక్షా కేంద్రాల్లో ఏమి జరుగుతుందో వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేంద్రాల్లో కాపీయింగ్‌ కట్టడికి మూడు ఫ్లయింగ్‌, మూడు సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ఆర్‌ఐవో, డీఈసీ సభ్యులు, ప్రత్యేకాధికారి, కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు, రాష్ట్రస్థాయి బోర్డు అధికారులు కూడా ఈ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు.

సెల్‌ఫోన్లు నిషేదం

పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించారు. చీఫ్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఇన్విజిలేటర్లు, పోలీసు, వైద్యసిబ్బంది, స్క్వాడ్‌ అధికారులు, ఇతర సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు. ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలు కూడా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది వద్ద తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఉండాలి. పరీక్షలకు సంబంధించిన సమాచారం అందించేందుకు ఆర్‌ఐవో కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోలు రూంను ఏర్పాటు చేశారు. దానికి 96528 85144 నెంబర్‌ను కేటాయించారు.

విద్యార్థులు వాట్సాప్‌ ద్వారా నేరుగా హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కళాశాల ప్రిన్సిపాల్‌ సంతకంతో సంబంధం లేకుండా పరీక్షకు హాజరుకావచ్చు. విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠినచర్యలు తీసుకుంటామని ఆర్‌ఐవో సురేష్‌ కుమార్‌ హెచ్చరించారు.

Updated Date - Feb 21 , 2026 | 11:45 PM