Share News

డీజే వద్దు

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:27 AM

Ban on DJs during Vinayaka festivities డీజే శబ్దాలు అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఏ వేడుకైనా సరే.. సందడి కోసం డీజే పెట్టడం సర్వసాధారణమైపోయింది. గతంలో ఎక్కడో నగరాలు, పబ్‌ల్లో కనిపించేది డీజే సంస్కృతి. కానీ ఇప్పుడు పల్లెలకూ విస్తరించింది. కాగా, ఆ అధిక శబ్దాల వెనుక ఎన్నో అనర్థాలు వెంటాడుతున్నాయి. డీజే ధాటికి కొంతమంది గుండెలు ఆగిపోతున్నాయి. ఎంతోమంది రుగ్మతల బారిన పడుతున్నారు.

డీజే వద్దు

  • ప్రాణాలు హరిస్తున్న అధిక శబ్దాలు

  • వినాయక ఉత్సవాల్లో వినియోగంపై నిషేధం

  • నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసుశాఖ హెచ్చరిక

  • రణస్థలం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి) :

  • నరసన్నపేటలో గతేడాది అక్టోబరులో గౌరమ్మ సంబరాలు సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే శబ్దాలకు ఓ భవనం మిద్దె కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

  • కవిటి మండలం కపాసుకుద్దిలో గత ఏడాది డీజేల శబ్దానికి ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. దీంతో ఇకపై డీజేలు వినియోగించుకూడదని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

  • జి.సిగడాం మండలం డీఆర్‌ వలసలో గత ఏడాది డీజే ధాటికి పలువురు అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామపెద్దలు, యువత సమావేశమైన ఏకగ్రీవంగా డీజేలపై నిషేధం విధించాలని తీర్మానించారు. నిబంధనను అతిక్రమిస్తే పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు.

  • డీజే శబ్దాలు అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఏ వేడుకైనా సరే.. సందడి కోసం డీజే పెట్టడం సర్వసాధారణమైపోయింది. గతంలో ఎక్కడో నగరాలు, పబ్‌ల్లో కనిపించేది డీజే సంస్కృతి. కానీ ఇప్పుడు పల్లెలకూ విస్తరించింది. కాగా, ఆ అధిక శబ్దాల వెనుక ఎన్నో అనర్థాలు వెంటాడుతున్నాయి. డీజే ధాటికి కొంతమంది గుండెలు ఆగిపోతున్నాయి. ఎంతోమంది రుగ్మతల బారిన పడుతున్నారు. శబ్దకాలుష్యంతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. సోమవారం నుంచి వినాయకచవితి ఉత్సవాలు ప్రారంభం కానుండడంతో.. డీజే శబ్దాల మోత తప్పదని ఆందోళన చెందుతున్నారు. కాగా అనర్థాల దృష్ట్యా ఈ సారి వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో డీజే వినియోగం వద్దని పోలీసు శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కమిటీ సభ్యులు, నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

  • మనం వింటున్న శబ్దం తీవ్రత పెరిగే కొలదీ రుగ్మతలు ఖాయమని వైద్యనిపుణులు చెబుతున్నారు. డీజే బాక్సుల నుంచి వచ్చే వైబ్రేషన్‌ చాలా ప్రమాదకరం. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవారిపై విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. ఆ వైబ్రేషన్‌తో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతుంది. 60 డెసిబుల్స్‌లోపు శబ్ధం వింటే ఎటువంటి ఇబ్బందులుండవు. 100 డెసిబుల్స్‌ శబ్దం దాటితే గుండె జబ్బులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 110 డెసిబుల్స్‌ శబ్దం దాటితే చికాకుతోపాటు విపరీతమైన కోపం, తలనొప్పి వస్తుంది. 120 డెసిబుల్స్‌ శబ్దం దాటితే చిరాకు, విపరీతమైన తలబాధ వస్తుంది. 160 డెసిబుల్స్‌ దాటితే చెవుల్లో వినికిడి కణాలపై ప్రభావం చూపుతాయి. నరాలు దెబ్బతిని పాక్షిక వైకల్యం కలుగుతుంది. 190 డెసిబుల్స్‌ శబ్దం దాటితే కర్ణభేరి పగిలిపోతోంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. పూర్వపు స్థితి రావడం చాలా కష్టమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే అటువంటి ప్రమాదకరమైన డీజేలను నిషేధించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. జిల్లాలో డీజేలు నిషేధమని పోలీసులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో నిషేధం అమలుకావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఈసారైనా పకడ్బందీగా నిషేధం అమలు చేయాలని కోరుతున్నారు.

  • చర్యలు తప్పవు

  • జిల్లాలో డీజేల వినియోగం నిషేధం. వినాయక వేడుకల్లో ఏర్పాటుచేస్తే కేసులు నమోదు చేస్తాం. డీజేల శబ్దంతో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. యువత సైతం తమ బైకులకు అధిక శబ్దం ఇచ్చే సైలెన్సర్లను తొలగించాలి. లేదంటే జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తాం. డీజేలపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం.

  • - ఎం.అవతారం, సీఐ, జేఆర్‌ పురం

  • ఆరోగ్యానికి హానికరం..

  • ఇటీవల శబ్దకాలుష్యం పెరుగుతోంది. ఇప్పటికే వాయుకాలుష్యంతో ప్రజలు రుగ్మతల బారిన పడుతున్నారు. డీజేల శబ్దాలు, సైలెన్సర్లతో అనర్థాలు అధికం. వినికిడి లోపంతోపాటు మానసిక వ్యాధులు కలుగుతాయి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ శబ్దం వింటే పెను ప్రభావం చూపుతుంది. డీజేలో వచ్చే సౌండ్‌ రేంజ్‌ 100 నుంచి 120 ఉంటుంది. ఈ సౌండ్‌ ప్రమాదం. అందుకే యువత ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి.

  • - ఎన్‌.పద్మావతి, సీహెచ్‌సీ వైద్యాధికారి, రణస్థలం

Updated Date - Sep 14 , 2026 | 12:27 AM