బస్‌షెల్టర్ లేక.. రోడ్డుపై నిరీక్షణ
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:03 AM
జలుమూరులో బస్‌షెల్టరు లేకపోవడంతో వివిద ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నిరీక్షించే సమయంలో అగచాట్లకు గురవుతున్నారు.
జలుమూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జలుమూరులో బస్‌షెల్టరు లేకపోవడంతో వివిద ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నిరీక్షించే సమయంలో అగచాట్లకు గురవుతున్నారు. వేసవి కాలం ఎండలో, వర్షాకాలం వర్షంలో బస్సులు కోసం నిరీక్షించి ఇబ్బందిపడుతున్నారు. జూనియర్ కళాశాల విడిచిపెట్టిన సమయంలో విద్యార్థులు బస్సులకోసం రోడ్డుపైనే నిల్చొని నిరీక్షించాల్సి వస్తోంది. జలుమూరు పరిసర గ్రామాలకు చెందిన ప్రయాణికులు శ్రీముఖలింగం, శ్రీకాకుళం, నరసన్నపేట వెళ్లేందుకు ఇక్కడకే వచ్చి బస్సెక్కాల్సి ఉంది. జలుమూరులో నేటికి ప్రయాణికుల సౌకర్యార్థం విశ్రాంతి భవనం ఏర్పాటుచేయక పోవంతో రోడ్డుపై, హోటళ్లు, కిరాణాషాపుల వద్ద బస్సులు, వాహనాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. వెంకటాపురం, రామచంద్రాపురం, కృష్ణాపురం, తమ్మయ్యపేట, హుస్సేనుపురం, గొలియాపుట్టి, కొత్తపేట, జగన్నాఽథపురం, బావాజీపేట, కోనదాలయ్యపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజలు ప్రయాణించేందుకు తప్పనిసరిగా జలుమూరు రావాల్సివస్తోంది. బస్సులకోసం జలుమూరు వచ్చిన ప్రయాణికులు తలదాచుకోడానికి బస్‌షెల్టరు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్డుపక్కన, దుకాణాల వద్ద నిల్చొని బస్సులు కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి జలుమూరులో ప్రయాణికుల విశ్రాంతి భవనం నిర్మించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.