Share News

నిధులు వెనక్కి మళ్లితే అధికారులపై వేటు: కలెక్టర్‌

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:47 PM

నిర్దేశిత సమయాలలో పనులు పూర్తికాక ప్రభుత్వ నిధు లు వెనుకకు మరలితే బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తానని ్లకలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు.

నిధులు వెనక్కి మళ్లితే అధికారులపై వేటు: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ , ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): నిర్దేశిత సమయాలలో పనులు పూర్తికాక ప్రభుత్వ నిధు లు వెనుకకు మరలితే బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తానని ్లకలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు. స్థానిక కేఎస్‌ఎం ప్లాజాలో నియోజకవర్గ స్థాయిలో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విద్యా శాఖ సమీక్షలో భాగంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ పప్పల వేణుగోపాలరావు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 41 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఐదు కేజీబీవీలకు ఒక్కొక్క దానికి రూ.2కోట్లు చొప్పున వ్యయంతో డార్మెటరీలు నిర్మించనున్నట్టు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌పై సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ ఉద్దానం పైపులైన్లలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్దానం ప్రాజెక్ట్‌ డీఈ డి.ఆశాలత మాట్లాడుతూ పైపులైనులు చేరేవరకే నిధులు మంజూరయ్యాయని వివరించారు. ఈ సమాధానానికి సంతృప్తిపడని ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించకుంటే ఉద్దానానికి నీరు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అధికారుల వైఫల్యం కారణంగా జేజేఏ నుంచి రూ.110కోట్లు వెనక్కి వెళ్లిపోయాయని తెలిపారు. తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారుల వైఫల్యం కారణంగా నిధులు వెనక్కి మరలితే బాధ్యులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డుమా పి.డి. బి.లవరాజు, ఆర్డీవో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 11:47 PM