Share News

కొత్తకొత్తగా కొసమాళ!

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:25 AM

Development works at Kosamala వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ గ్రామం కనీసస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. పంచాయతీకి వచ్చిన నిధులు పక్కదారి పట్టాయి. దీనిపై కొంతమంది గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెండుసార్లు సర్పంచ్‌ చెక్‌పవర్‌ రద్దు చేశారు.

కొత్తకొత్తగా కొసమాళ!
కొసమాళలో సీసీ రోడ్డు, మోడల్‌ డ్రెయిన్ల నిర్మాణం

ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు

మోడల్‌గా మ్యాజిక్‌ డ్రెయిన్లు ఏర్పాటు

సీసీ రహదారుల నిర్మాణం

మెళియాపుట్టి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ గ్రామం కనీసస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. పంచాయతీకి వచ్చిన నిధులు పక్కదారి పట్టాయి. దీనిపై కొంతమంది గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెండుసార్లు సర్పంచ్‌ చెక్‌పవర్‌ రద్దు చేశారు. ఈక్రమంలో అభివృద్ధి పూర్తిగా పడకేసింది. కనీసం రహదారి సౌకర్యం కూడా లేక గ్రామస్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇదీ మెళియాపుట్టి మండలం కొసమాళ గ్రామస్థుల దుస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. అభివృద్ధి బాటన పయనిస్తూ.. గ్రామానికి కొత్తకళ సంతరించుకుంటోంది. మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి బి.ప్రసాదరావు తమ గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుతోపాటు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుమారు రూ.కోటి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. వాటితో అభివృద్ధి పనులు చేస్తున్నారు. గతంలో గ్రామంలో అడుగుపెడితే బురద కనిపించేది. దీనిని శాశ్వతంగా నివారించేందుకు మోడల్‌గా మ్యాజిక్‌ డ్రైన్లు ఏర్పాటు చేశారు. మహేంద్రతనయ నది ఒడ్డున ఉన్న స్వర్గధామానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఆ మార్గంలో సీసీ రోడ్డుతోపాటు.. స్వర్గధామం వద్ద షెడ్‌లు నిర్మించారు. మరోవైపు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎత్తిపోతల పథకానికి కూడా లైన్‌క్లియర్‌ అయింది. పాఠశాలను సుందరంగా నిర్మించారు. తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులతోపాటు గ్రామస్థుల సహకారంతో రాజకీయాలకు అతీతంగా మరిన్ని అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు తెలిపారు. కూటమి పాలనలో జోరుగా అభివృద్ధి పనులు జరుగుతుండడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:25 AM