Share News

కొత్త జిల్లాపరిషత్‌

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:31 AM

30 mandals under ZP jurisdiction రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నూతన జిల్లా ప్రజాపరిషత్‌ (జడ్పీ)ల ఏర్పాటుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. గతంలో ఉన్న 13 జడ్పీల స్థానంలో.. ప్రస్తుతం ఉన్న 28 జిల్లాలకు అనుగుణంగా 28 కొత్త జడ్పీలను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ శనివారం జీవో ఎంఎస్‌ 114ను జారీ చేసింది.

కొత్త జిల్లాపరిషత్‌

  • శ్రీకాకుళం జడ్పీ పరిధిలోకి 30 మండలాలు

  • ఈ నెల 24తో ముగియనున్న ప్రస్తుత పాలకవర్గాల గడువు

  • శ్రీకాకుళం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నూతన జిల్లా ప్రజాపరిషత్‌ (జడ్పీ)ల ఏర్పాటుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. గతంలో ఉన్న 13 జడ్పీల స్థానంలో.. ప్రస్తుతం ఉన్న 28 జిల్లాలకు అనుగుణంగా 28 కొత్త జడ్పీలను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ శనివారం జీవో ఎంఎస్‌ 114ను జారీ చేసింది. ఈ నెల 24తో ప్రస్తుత జడ్పీ పాలకవర్గాల పదవీకాలం ముగియనుండటంతో ఆ తర్వాత కొత్త జడ్పీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జిల్లా జడ్పీ స్వరూపం అధికారికంగా ఖరారైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన జరిగింది. అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను పార్వతీపురం మన్యం జిల్లాలోనూ, రాజాం నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో కలిపేశారు. కానీ ఈ రెండు నియోజకవర్గాల పరిధి ఎనిమిది మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు మాత్రం శ్రీకాకుళం జడ్పీ పరిధిలోనే ఉంచేశారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై విభజిత జిల్లాలో ఉన్న మండలాలకే జడ్పీ వర్తిస్తుంది.

  • జడ్పీ పరిధిలోకి 30 ఎంపీపీలు

  • పునర్వ్యవస్థీకరించిన శ్రీకాకుళం రెవెన్యూ జిల్లా భౌగోళిక సరిహద్దులే నూతన శ్రీకాకుళం జడ్పీ సరిహద్దులుగా ఉండనున్నాయి. శ్రీకాకుళం జడ్పీ పరిధిలోకి మొత్తం 30 మండల పరిషత్‌లు (ఎంపీపీలు)వస్తాయి. ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల, గంగువారి సిగడాం, గార, హిరమండలం, ఇచ్ఛాపురం, జలుమూరు, కంచిలి, కవిటి, కోటబొమ్మాళి, కొత్తూరు, ఎల్‌ఎన్‌ పేట, లావేరు, మందస, మెళియాపుట్టి, నందిగాం, నరసన్నపేట, పలాస, పాతపట్నం, పోలాకి, పొందూరు, రణస్థలం, సంతబొమ్మాళి, సారవకోట, సరబుజ్జిలి, సోంపేట, శ్రీకాకుళం, టెక్కలి, వజ్రపుకొత్తూరు మండలాలు శ్రీకాకుళం జడ్పీలో కొనసాగనున్నాయి. ఈ ఎంపీపీలన్నీ ఇకపై జిల్లాస్థాయి పాలన, ప్రణాళికలు, గ్రామీణాభివృద్ధి కోసం శ్రీకాకుళం జడ్పీ పర్యవేక్షణలో ఉంటాయి.

  • కొత్తగా సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు..

  • కొత్తగా ఏర్పడే 28 జడ్పీల కార్యనిర్వాహక బాధ్యతల కోసం రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 15 జడ్పీ సీఈవో, మరో 15 డిప్యూటీ సీఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాల పరిధిలోని మండలాల సంఖ్య, పనిభారం ఆధారంగా ప్రస్తుత సిబ్బందిని కొత్త జడ్పీలకు కేటాయించనున్నారు. జిల్లాల భౌగోళిక సరిహద్దులకు అనుగుణంగా ఆయా ఎంపీపీలన్నీ కొత్త జడ్పీ పరిధిలోకి వచ్చేలా అధికారిక రికార్డుల్లో మ్యాపింగ్‌ చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 24 తర్వాత కొత్త జడ్పీల ఏర్పాటు ప్రక్రియ సజావుగా సాగేందుకు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Updated Date - Sep 06 , 2026 | 12:31 AM