న్యూ ఇయర్ ‘కిక్కు’..
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:40 PM
Alcohol sales! జిల్లాలో కొత్త సంవత్సర వేడుకల వేళ మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31న రికార్డుస్థాయిలో రూ.5,47,01,768 విలువైన మద్యాన్ని జిల్లావాసులు కొనుగోలు చేశారు. సాధారణ రోజులతో పోలిస్తే ఇది అత్యధికం. గతంలో ‘జే’ బ్రాండ్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రముఖ బ్రాండెడ్ మద్యం అందుబాటులో లభ్యం కావడంతో... అవసరమైన మేరకు వేడుకలకు తగ్గట్టుగా కోరుకున్న మద్యాన్ని కొనుగోలు చేసుకున్నారు.
ఒక్కరోజే రూ.5.47 కోట్ల మద్యం విక్రయాలు!
సిక్కోలులో మందుబాబుల జోరు
బీర్ల కంటే ‘హార్డ్’ లిక్కర్‌కే మొగ్గు
శ్రీకాకుళం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త సంవత్సర వేడుకల వేళ మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31న రికార్డుస్థాయిలో రూ.5,47,01,768 విలువైన మద్యాన్ని జిల్లావాసులు కొనుగోలు చేశారు. సాధారణ రోజులతో పోలిస్తే ఇది అత్యధికం. గతంలో ‘జే’ బ్రాండ్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రముఖ బ్రాండెడ్ మద్యం అందుబాటులో లభ్యం కావడంతో... అవసరమైన మేరకు వేడుకలకు తగ్గట్టుగా కోరుకున్న మద్యాన్ని కొనుగోలు చేసుకున్నారు. జిల్లాలో 176 మద్యం దుకాణాలు, 9 బార్‌లలో మద్యం విక్రయాలు జరిగాయి. సాధారణంగా న్యూ ఇయర్ అంటే యువకులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు. కానీ ఈ సారి చలి తీవ్రత కారణంగా మందు బాబులు బీర్లను పక్కనబెట్టి ఐఎంఎల్ (హార్డ్ లిక్కర్) వైపే మొగ్గు చూపారు. గత ఏడాది (31-12-2024) 6,984 లిక్కర్ కేసులు అమ్ముడవగా.. ఈసారి ఏకంగా 8,267 కేసులకు పెరిగింది. అదే సమయంలో బీర్ల అమ్మకాలు మాత్రం 2,621 కేసుల నుంచి 2,052 కేసులకు పడిపోయాయి.
జనవరి 1న తగ్గిన తూకం
డిసెంబరు 31న షాపుల ముందు క్యూ కట్టిన మందుబాబులు.. జనవరి 1న మాత్రం నెమ్మదించారు. గురువారం అమ్మకాలు భారీగా తగ్గాయి. కేవలం రూ. 1,04,76,440 విక్రయాలు మాత్రమే జరిగాయి. 2024 జనవరి 1న ఏకంగా రూ. 3.17 కోట్ల అమ్మకాలు జరిగాయి. అప్పటితో పోలిస్తే ఈ సారి జనవరి 1న అమ్మకాలు మూడో వంతుకు పడిపోవడం గమనార్హం.
మద్యం విక్రయాలు ఇలా..
=======================================
వివరాలు 31-12-2024 31-12-2025
=======================================
లిక్కర్ కేసులు 6,984 8,267
బీర్లు కేసులు 2,621 2,052
ఆదాయం రూ. 5కోట్లు రూ.5.47 కోట్లు