కొత్తగా రూర్బన్ పంచాయతీలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:55 PM
గ్రామ పంచాయతీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
- జిల్లాలో 12 ఏర్పాటు
- జనాభా, ఆదాయం ప్రాతిపదికన విభజన
- మునిపాలిటీల తరహాలో పాలన
మెళియాపుట్టి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాటిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పంచాయతీ అధికారులకు పదోన్నతులు కల్పించారు. అధికంగా నిధులు మంజూరు చేశారు. తాజాగా జనాభా ప్రాతిపదికన పంచాయతీలను విభజించి వాటికి గ్రేడ్లు కేటాయించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. జనాభా, వార్షిక ఆధాయం, భౌగోళిక స్వరూపం ఆధారంగా పంచాయతీలను విభజించి పరిపాలన చేపట్టనున్నారు. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలు ఐదు గ్రేడ్‌లుగా ఉండేవి. వీటిని ఇప్పుడు నాలుగుకు కుదించారు. కొత్తగా రూర్బన్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 12 పంచాయతీ లను రూర్బన్‌గా విభజించారు. ఇందులో హిరమండలం, గార, కవిటి, మందస, నరసన్నపేట, పాతపట్నం, పొందూరు, రణస్థలం, సోంపేట, బారువ, టెక్కలి, శ్రీకాకుళం పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో 10 వేలకు పైగా జనాభా, వార్షిక ఆదాయం రూ.కోటి పైగా ఉండడంతో వాటిని రూర్బన్‌లో చేర్చారు. 3వేల నుంచి 10 లోపు జనాభా, వార్షిక ఆదాయం రూ.30 లక్షల నుంచి రూ.కోటి లోపు ఉన్న 117 పంచాయతీలను గ్రేడ్-1గా, రెండు వేల నుంచి మూడు వేల జనాభా గల 211 పంచాయతీలను గ్రేడ్-2గా, రెండు వేల కంటే తక్కువగా జనాభా ఉన్న 572 పంచాయతీలను గ్రేడ్ 3 గాను విభజించారు. మైదానం, ఉపప్రణాళికా ప్రాంతం ప్రాతిపదికన వీటిని విభజించారు.
మునిసిపాలిటీ మాదిరిగా..
రూర్బన్ గ్రామ పంచాయతీల్లో మునిసిపాలిటీ తరహా పాలన సాగ నుంది. వీటిలో టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజనీరింగ్, సాధారణ పాలనా విభాగాలను ఏర్పాటు చేస్తారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను ఈ పోస్టుల్లో నియమిస్తారు. ఇంటి పన్ను, నీటి పన్ను వసూలు చేస్తారు. తద్వారా పంచాయతీల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. వీటికి గెజిటెడ్ అధికారిని నియమిస్తారు. ఈ విషయమై మెళియాపుట్టి ఎంపీడీవో ప్రసాద్‌పండాను వివరణ కోరగా.. ‘గ్రేడ్‌ల వారీగా పంచాయతీలను విభజించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొత్తగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటయ్యాయి.’ అని తెలిపారు.