‘పది’లో నూతన సంస్కరణలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:22 AM
ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షల్లో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రశ్నాపత్రాల శైలిలో సమూల మార్పులు తీసుకొచ్చింది.
- పరీక్షల్లో బట్టిపట్టే విధానానికి స్వస్తి
- విషయ పరిజ్ఞానంపై పట్టు పెంచేందుకు ప్రణాళికలు
- అవగాహన, సృజనాత్మకత, సున్నితత్వం రంగాల వారీగా ప్రశ్నలు
- విద్యార్థులకు ఎంతో ప్రయోజనమంటున్న విద్యానిపుణులు
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షల్లో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రశ్నాపత్రాల శైలిలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు అనుసరిస్తున్న బ్లూమ్స్ టాక్సానమీ స్థానంలో ఎన్‌సీఈఆర్టీ పరిధిలోని పరఖ్ వర్గీకరణాన్ని ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమలు చేయనుంది. దీనివల్ల ప్రశ్నాపత్రాలు కొత్తవిధానంలో రూపుదిద్దుకోనున్నాయి. విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని విషయాలను బట్టీపట్టకుండా పాఠ్యాంశాలను అర్థం చేసుకొని సొంతంగా ఆలోచించి విశ్లేషణాత్మకంగా సమాధానాలు రాసేలా ఈ విధానాన్ని రూపొందించారు. అందుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను, ప్రశ్నాపత్రాల నమూనాలు, మార్కులు వెయిటేజీలను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. విద్యార్థి ఆలోచనలకు తగ్గినట్లుగా సున్నితత్వం, సృజనాత్మకత విభాగాల్లో ఎక్కువగా ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు ఇస్తారు. ఈ ప్రశ్నలకు పుస్తకాల్లో ఉన్నట్లుగా ఒకే రకంగా సమాధానం రాయాలనే నిబంధన ఉండదు. విద్యార్థి తనకు నచ్చిన రీతిలో సొంత అభిప్రాయాలను జోడించి సమాధానాలు రాయవచ్చు.
ప్రశ్నపత్రం ఇలా...
- అవగాహన విభాగం నుంచి 60శాతం మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఇందులో విద్యార్థి సాధారణ విజ్ఞానం, వారు పాఠాలను ఎంతవరకు అర్థం చేసుకున్నారు, వాటిని ఎలా అమలు చేస్తారు అనే అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీషు సబ్జెక్టులో కూడా అవగాహనకు 65శాతం వెయిటేజ్ ఇచ్చారు.
- సృజనాత్మకతకు 20శాతం మార్కులు కేటాయించారు. విద్యార్థి తన జ్ఞానాన్ని , నైపుణ్యంగా మార్చి ఎలా ఉపయోగించగలడు. కొత్త ఆలోచనలు, భాషపై స్పష్టత, కమ్యూకేషన్ నైపుణ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి.
- సున్నితత్వ విభాగంలో 20శాతం ప్రశ్నలు ఉంటాయి. విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరచడం, సానుకూల దృక్పథంలో సమాజంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడం, టీమ్‌వర్క్ వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీషు సబ్జెక్టుల్లో 25 నుంచి 30వాతం వెయిటేజ్ ఇస్తారు.
- అన్ని సబ్జెక్టుల్లో 25శాతం నుంచి 30శాతం సులభతర ప్రశ్నలు, 50శాతం ఒక మోస్తరు ప్రశ్నలు, 20శాతం క్లిష్టమైన ప్రశ్నలు ఉంటాయి.
సృజన్మాతకత పెరుగుతుంది
ఈ ఏడాది నుంచి పది ప్రశ్నపత్రాల రూపకల్పనలో విద్యాశాఖ సంస్కరణలు తీసుకురావడం మంచి పరిణామమే. ఈ విధానం విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంపొందించుకొని తద్వారా సృజనాత్మకత పెంచుకునేందుకు దోహదపడుతుంది. అందుకు తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేవిధంగా పాఠ్యప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. ఈ విధానం ఆరోతరగతి నుంచి అమలు చేస్తే పదోతరగతి వచ్చేసరికి సులువుగా పరీక్షలు రాయగలరు
- ఎస్.సాయిశ్రీనివాస శర్మ, ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్, పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నతపాఠశాల, నరసన్నపేట
విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలి
పది పరీక్షల్లో ఈ ఏడాది నుంచి తీసుకురాబోతున్న సంస్కరణలు మంచిదే. అయితే ఒకేసారి విద్యార్థులపై ఈ విధానంతో ప్రయోగాలు చేయడం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వారికి తగిన తర్ఫీదు ఇవ్వాలి. ముందుగా ఎనిమిదో తరగతి నుంచి ఈవిధానం అమలు చేసి.. దశల వారీగా పెంచుకుంటే పోతే బాగుంటుంది.
-ఓకులా రత్నమాల, హెచ్‌ఎం, జడ్పీ ఉన్నత పాఠశాల, సత్యవరం
అంత సులభం కాదు
కొత్త విధానంలో ఇంగ్లీషు పేపరు రాయడం అంత సులభం కాదు. ఇంగ్లీష్ భాషపై పరిజ్ఞానం ఎంతో అవసరం. విద్యార్థులు తమ భావాన్ని వ్యక్తీకరించి పరీక్షల్లో రాయడం కష్టం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భాషపై పట్టు తక్కువగా ఉంటుంది.
-నక్క ఈశ్వర్‌లాల్, ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్, జడ్పీ ఉన్నత పాఠశాల, తండ్యాలవలస