Share News

కొత్త రైల్వేజోన్‌ సిద్ధం

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:18 AM

సౌత్‌కోస్టు రైల్వేజోన్‌ సేవలు జూన్‌ నుంచి ప్రారంభంకానున్నట్లు ఆ సంస్థ ఉద్యోగులకు సంకేతాలు అందాయి.

కొత్త రైల్వేజోన్‌ సిద్ధం
అమృత భారత్‌ పథకంలో భాగంగా పలాస రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు

- జూన్‌ నుంచే కార్యకలాపాలు

- ఇచ్ఛాపురం నుంచి పలాస వరకూ అందులోనే

- ఉద్యోగుల బదిలీలకు ఆప్షన్లు ఇచ్చిన ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే

పలాస, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): సౌత్‌కోస్టు రైల్వేజోన్‌ సేవలు జూన్‌ నుంచి ప్రారంభంకానున్నట్లు ఆ సంస్థ ఉద్యోగులకు సంకేతాలు అందాయి. ఇచ్ఛాపురం నుంచి పలాస వరకూ ఉన్న రైల్వేస్టేషన్లన్నీ విశాఖ కేంద్రంగా పనిచేసే సౌత్‌ కోస్టులోకి రానున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆప్షన్లు ఇచ్చారు. సౌత్‌కోస్టులో ఉంటారా.. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేశాఖకు వస్తారా అనేది వాటి సారాంశం. ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో సౌత్‌కోస్టులో ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో మొత్తం పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా యథాతథంగా ఉండిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. విశాఖ రైల్వేజోన్‌ ప్రకటించిన నుంచి పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వేస్టేషన్లన్నీ సందిగ్ధంలో ఉండిపోయాయి. పలాస రైల్వేస్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జయకృష్ణాపురం(కిష్టుపురం) వరకూ విశాఖ డివిజన్‌లో ఉండేది. అక్కడి వరకే విశాఖ జోన్‌ పరిధిలోకి వస్తాయని రైల్వేశాఖ అధికారులు మ్యాపింగ్‌ చేశారు. దీంతో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వేస్టేషన్లీ ఖుర్ధాడివిజన్‌, ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ పరిధిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు గౌతు శిరీష, బెందాళం అశోక్‌కుమార్‌ చొరవ తీసుకొని కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే జోన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. దీంతో ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా పలాస, మందస రోడ్‌, బారువ, సోంపేట రోడ్‌, జాడుపూడి, ఇచ్ఛాపురం వరకూ మొత్తం రైల్వేస్టేషన్లీ విశాఖజోన్‌ పరిధిలోకి తీసుకువచ్చినట్లు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. దీనిపై ఒడిశా అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు రైల్వేమంత్రిపై కూడా ఒత్తిడి తీసుకువచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో కూడా అదే ప్రభుత్వం ఉండడంతో ఇచ్ఛాపురం వరకూ విశాఖ జోన్‌ పరిధిలోకి వచ్చే అంశాన్ని వివాదం చేయకుండా యధాస్థానాన్ని కొనసాగించింది. దీనిపై రైల్వేశాఖ నుంచి కూడా ఆమోదం లభించడంతో ప్రస్తుతం జోన్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులను పరిగణలోకి తీసుకుంటోంది. ఖుర్ధారోడ్‌ డివిజన్‌లో ఉండాల్సిన వారికి ఆప్షన్లు ఇచ్చింది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు కూడా అధిక శాతం విశాఖ పరిధిలోనే ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండడంతో పలాస నుంచి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులంతా చర్చల్లో మునిగిపోయారు. విశాఖ జోన్‌తోనే అభివృద్ధి సాధ్యమనే గట్టి నమ్మకంతో వారంతా ఉన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 12:18 AM