వచ్చే నెల నుంచి వితంతువులకు కొత్తపింఛన్లు
ABN , Publish Date - May 18 , 2026 | 12:01 AM
Pensions for widows కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12 నుంచి అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
వైసీపీ పాలనలో ‘ఎత్తిపోతలు’ అటకెక్కాయి
మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, మే 17(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12 నుంచి అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. సంతబొమ్మాళి మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను విన్నవించారు. వినతులను మంత్రికి అంజేశారు. అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా కింద కొంతమంది వితంతువులకు నెలకు రూ.4వేలు పింఛన్ అందిస్తున్నాం. త్వరలో అర్హత ఉన్నవారు పింఛన్ కోసం నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరికీ పథకాలు, సేవలు అందేలా చూస్తాం. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందిస్తున్నాం. దీనికోసం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాల’ని సూచించారు. సబ్‌రిస్ట్రార్ కార్యాలయాల్లో 18 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని, సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా చొరవ చూపాలని పలువురు ఉద్యోగులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు వినతిపత్రం అందజేయగా.. గత వైసీపీ పాలకులు ఎత్తిపోతల పథకాలను అటకెక్కించారని, వారి పాపం వల్ల కొంతమంది రైతులకు సాగు నీరు అందటం లేదని అచ్చెన్న విమర్శించారు. త్వరలో ఎత్తిపోతల పథకాలను బాగు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.