రెండేళ్లలో ‘నేరడి’ పూర్తి
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:07 AM
District Irrigation Advisory Board Meeting ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2500 కోట్లు కేటాయించనున్నారని, శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన నేరడి బ్యారేజ్ నిర్మాణాన్ని రెండేళ్ల కాలంలోనే పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
ఈ ప్రాజెక్టుతో జిల్లా సస్యశ్యామలం
ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు రూ.2500 కోట్లు
శివారు భూములకు నీరందించడమే తొలి ప్రాధాన్యం
2027 ఖరీఫ్ నాటికి ఆఫ్‌షోర్ రిజర్వాయర్
కాలువల లీకేజీలకు అధికారులదే పూర్తి బాధ్యత
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం
శ్రీకాకుళం, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2500 కోట్లు కేటాయించనున్నారని, శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన నేరడి బ్యారేజ్ నిర్మాణాన్ని రెండేళ్ల కాలంలోనే పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కాలువల ద్వారా శివారు భూములకు సాగునీరు అందించడమే తమ మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి 33వ జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశాన్ని నిర్వహించారు. మూడు గంటల పాటు సాగిన సమీక్షలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, కాలువల నిర్వహణ, భవిష్యత్ కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఒడిశాతో వీడిన చిక్కులు.. రెండేళ్లలో నేరడి..
జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా వంటి అపారమైన నీటి వనరులు ఉన్నా ప్రతిఏటా నీరంతా సముద్రం పాలవుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఇప్పుడు అడ్డంకులు తొలగిపోయాయన్నారు. ఒడిశాతో వివాదాలను పరిష్కరించుకున్నామని, వెంటనే టెండర్లు పిలిచి రెండేళ్లలో పనులు పూర్తి చేయాలంటూ సీఎం ఆదేశించారని వెల్లడించారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నేరడి కోసం ఇంకా 160 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు.
శివారు భూములకే తొలి ప్రాధాన్యం
ప్రస్తుతం వంశధారలో ఆశించిన మేర నీరు లేనందున వర్షాధారంగానే ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు దాటితేనే ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలన్నారు. ఆ నీటిని ముందుగా పలాస, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల పరిధిలోని శివారు ప్రాంతాలకు అందించాలని ఆదేశించారు. వంశధార ప్రధాన కాలువను అధికారులు ముందుగానే పరిశీలించాలని, కాలువల్లో ఎక్కడా లీకేజీలు తలెత్తినా సంబంధిత ఇంజనీర్లదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు.
నిర్లక్ష్యపు పాలన.. పూడిక కూడా తీయలేదు..
2019 నాటికే వంశధార ప్రాజెక్టును 97 శాతం పూర్తి చేస్తే.. గత తుగ్లక్ ప్రభుత్వం మిగిలిన 3 శాతం పనులను కూడా పూర్తి చేయలేక పోయిందని మంత్రి విమర్శించారు. కాలువల్లో తట్టెడు మట్టి కూడా తీయకపోవడంతో శివారు రైతులు నీరు లేక ఐదేళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. వంశధార నదిపై గత ప్రభుత్వం అశాస్త్రీయంగా మంజూరు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ (ఎత్తిపోతల పథకం) కాంట్రాక్టులు, కమీషన్ల కోసమేనని ధ్వజమెత్తారు. ఇది ప్రజలు పన్నులతో చేపట్టిన పనులు కనుక బకాయిలు ఇచ్చి శరవేగంగా పనులు జరిపిస్తున్నామని, ఈ ఖరీఫ్ చివరి నాటికైనా ఆ లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేస్తామని అన్నారు. మూలన పడిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును 2027 ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తి చేసి రైతులకు అందిస్తామన్నారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు లేవనెత్తిన స్థానిక అంశాలపై మంత్రి అచ్చెన్నాయుడు తక్షణమే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వరద ముప్పుపై అప్రమత్తత
వంశధార వరద పోటెత్తితే తలెత్తే సమస్యలను నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రస్తావించగా.. ముప్పు పొంచి ఉన్న చీపురుపల్లి గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని టెక్కలి ఆర్డీవోను మంత్రి ఆదేశించారు. నాగావళి వరద వల్ల అల్లిన గ్రామానికి పొంచి ఉన్న ముప్పును ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రస్తావించగా తక్షణమే ఇసుక బస్తాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు.
భూసేకరణ, నిధులు
ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నిధులపై సమగ్ర జాబితా సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను మంత్రి ఆదేశించారు. మడ్డువలస రిజర్వాయర్ భూసేకరణకు నిధులు లేవని డిప్యూటీ కలెక్టర్ జి.జయదేవి తెలుపగా.. వెంటనే బిల్లులు పెట్టాలని ఆదేశించారు.
పెండింగ్ ప్రాజెక్టులు
నిధుల లేమితో ఆగిపోయిన కళింగదల్, డబార్సింగ్ తదితర ప్రాజెక్టులపై ఇరిగేషన్ మంత్రితో, సీఈతో మాట్లాడతానని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు హామీ ఇచ్చారు. నారాయణపురం, ఆర్‌ఎంసీ (58 కిలోమీటర్లు) పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
స్థానిక వినతులు
మైనర్ ఇరిగేషన్ పరిధిలోని ఓని గెడ్డ ఆక్రమణలను తొలగించినట్లు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పారు. ఎచ్చెర్ల శివారు భూములకు ఈ ఏడాది నీరందించేందుకు అంచనాలు తయారు చేయాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సూచన మేరకు అధికారులను మంత్రి ఆదేశించారు. పొన్నాడలో ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు, నిలిచిపోయిన మడపాం ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐడీసీ అధికారులను ఆదేశించారు.
ప్రతి నీటి బొట్టునూ కాపాడుకుందాం
ఈ ఏడాది ఎల్-నినోతో వర్షపాతం తక్కువగా నమోదైనా వచ్చిన నీటితో చెరువులన్నింటినీ నింపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వంద రోజుల్లో చేపట్టిన ‘జలధార’ పనుల ప్రగతిని కలెక్టర్ వివరించారు. జిల్లాలో లస్కర్ల అవసరంపై నివేదిక ఇవ్వాలని, వచ్చే సమావేశానికి కాంట్రాక్టర్లను కూడా పిలవాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, వంశధార, నారాయణపురం ప్రాజెక్టుల చైర్మన్లు అరవల రవీంద్ర, సనపల డిల్లీశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, ఇరిగేషన్, వంశధార ఎస్‌ఈలు సుధాకర్, రామచంద్రరావు, ఈఈ శేఖర్, ఆర్డీవోలు కృష్ణమూర్తి, సాయిప్రత్యూష, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.