Share News

రూ.750 కోట్లతో నేరడి బ్యారేజీ

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:02 AM

Solution to the irrigation water problem జిల్లా రైతుల సాగునీటి కష్టాలు తీర్చేలా.. వంశధార నదిపై రూ.750 కోట్లతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

రూ.750 కోట్లతో నేరడి బ్యారేజీ
శంకుస్థాపన చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

సాగునీటి సమస్యకు పరిష్కారం

పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తాం

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

సంతబొమ్మాళి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతుల సాగునీటి కష్టాలు తీర్చేలా.. వంశధార నదిపై రూ.750 కోట్లతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం బోరుభద్రలో రూ.10కోట్లతో మంజూరైన సీసీ రహదారులను ఆయన ప్రారంభించారు. రక్షితనీటి పథకం శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో సాగునీటి రంగం నిర్లక్ష్యానికి గురైంది. ఏటా వంశధార శివారు ప్రాంత రైతులు సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా నేరడి బ్యారేజీ నిర్మించనున్నాం. దీని ద్వారా జిల్లా ప్రజలు ఏటా మూడు పంటలు పండించుకోవచ్చు. 40 ఏళ్లుగా వంశధార నదీ జలాలపై ఉన్న సమస్యను సీఎం చంద్రబాబునాయుడు ఒడిశా ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం చూపారు. ప్రస్తుతం రూ.10కోట్లు మంజూరు చేసి.. వంశధార కాలువల మరమ్మతులు చేపడుతున్నాం. ఎన్నికల హామీలన్నీ రెండేళ్లలోనే నెరవేర్చాం. రాష్ట్రంలో 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తాం. బోరుభద్ర- పాతమేఘవరం- నౌపడ వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించాం. బోరుభద్ర -సంతబొమ్మాళి రహదారి నిర్మాణానికి త్వరలోనే భూమిపూజ చేస్తానన్నారు. ఉదయపురం పంచాయతీ రైతులకు సాగునీరు అందించేందు ఎత్తిపోతల పథకం పనులకు రూ.34కోట్లతో అంచనాలు సిద్ధం చేశామ’ని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరినా.. వారిలో స్పందన లేదన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కూచెట్టి కాంతారావు, ఏఎంసీ ఉపాధ్యక్షురాలు బాడాన వెంకటరమణమ్మ, మండల టీడీపీ అధ్యక్షుడు సుగ్గు స్వరూప్‌రెడ్డి, రెడ్డి అప్పన్న, అప్పిని వెంకటేష్‌, వజ్జ ప్రభాకర్‌, వల్లభ వసంతరావు, ముద్దపు రమణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:02 AM