విధుల్లో నిర్లక్ష్యం.. హెచ్‌ఎం సస్పెన్షన్
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:01 AM
సోంపేట జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనలో విద్యాశాఖాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విధు ల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన హెచ్‌ఎం పి.పుష్పాంజలిని సస్పెండ్ చేస్తూ డీఈవో రవిబాబు బుధవారం ఉత్తర్వు లిచ్చారు.
విద్యార్థినుల అస్వస్థతపై కలెక్టర్ సీరియస్
సోంపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): సోంపేట జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనలో విద్యాశాఖాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విధు ల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన హెచ్‌ఎం పి.పుష్పాంజలిని సస్పెండ్ చేస్తూ డీఈవో రవిబాబు బుధవారం ఉత్తర్వు లిచ్చారు. ఈనెల 10న సోంపేట బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బుధవారం ‘ఆంధ్రజ్యోతి’తోపాటు వివిధ పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటనను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తీవ్రంగా పరిగణించారు. ఘటనకు బాధ్యులపై ఆయన సీరియస్ అయి తక్షణం చర్యలు చేపట్టాలని డీఈవోని ఆదేశించారు.
సమస్య పరిష్కారంలో హెచ్‌ఎం విఫలం
కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలన చేసిన డీఈవో విద్యార్థినులు అస్వస్థతకు గురైన సమయంలో సమస్య పరిష్కరించడంలో హెచ్‌ఎం పుష్పాంజలి పూర్తిగా విఫలమయ్యారని నిర్థారించారు. బాధ్యతాయుతమైన ఉద్యోగిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర అలసత్వం కిందకే వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హెడ్ క్వార్టర్ దాటరాదని ఆంక్షలు
ఏపీసీఎస్ (సీసీఏ) రూల్స్ 1991 లోని రూల్ 8 సబ్‌రూల్ (1) ప్రకారం హెచ్‌ఎం పి.పుష్పాంజలిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రక టించారు. శాఖాపరమైన విచారణ పూర్తయి, విశాఖ ఆర్జేడీ నుంచి తుది నిర్ణయం వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని, ఈ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లరాదని ఆమెను ఆదే శించారు. నిబంధనల ప్రకారం ఆమెకు జీవనభృతి చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వుల కాపీలను పలాస డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ద్వారా హెచ్‌ఎంకు అందజేయాలని ఆదేశించారు.
రాష్ట్రస్థాయి అధికారులకు నివేదిక
ఈ ఘటన వివరాలను, తీసుకున్న సస్పెన్షన్ చర్యల కాపీలను కలెక్టర్‌తోపాటు విశాఖపట్నం ఆర్జేడీకి, అమరావతిలోని మధ్యాహ్నభోజన పథకం డైరెక్టర్‌కు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు, అదేవిధంగా జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌కు సమాచారం నిమిత్తం పంపినట్లు ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆరా
విద్యార్థినులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విద్యాశాఖ అధికారుల నుంచి ఆరా తీశారు. భోజనంలో నూనె శాతం ఎక్కువకావడం వల్లే విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యా రని, ఆసుపత్రిలో చికిత్స పొందిన నలుగురు విద్యార్థినులు పూర్తిగా కోలుకోవడంతో ఇళ్లకు పంపించామని డీఈవో రవిబాబు, ఎంఈవో జోరాడు మంత్రికి వివరించారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులకు బాధ్యతాయుతంగా సమాధానం ఇవ్వని హెచ్‌ఎంని సస్పెండ్‌చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంఈవోలు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవ్యేక్షించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
డిప్యూటీ డీఈవో విచారణ
బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం తీరు సరిగా లేదని, విద్యార్థినులు అస్వస్థతకు గురైతే కనీసం పరామర్శించక పోవడం దారుణమని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సురేష్, అస్వస్థకు గురైన విద్యార్థిని తండ్రి నారాయణ పేర్కొన్నారు. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యం లో డిప్యూటీ డీఈవో విలియమ్స్, డీఈవో కార్యాలయ ఏడీ ఎం.శ్రీనివాసరావు బుధవారం పాఠశాలను సంద ర్శించారు. సిబ్బంది, విద్యార్థినులు, వసతి గృహ వార్డెన్ తదితరుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేప ట్టారు. ఈ నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని తెలి పారు. ఈ విచారణలో ఎంఈవోలు ఎస్.జోరాడు, కృష్ణంరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘సమగ్ర విచారణ చేపట్టాలి’
బాలికోన్నత పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు కోరారు. పాఠశాలను బుధవారం సందర్శించి విద్యార్థినుల ఆరో గ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన వెంట పీఏసీఎస్ డైరెక్టర్ దున్న పాపారావు ఉన్నారు.