నాడు నిర్లక్ష్యం.. నేడు అభివృద్ధి
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:24 AM
The coalition government completes two years in office today కూటమి ప్రభుత్వ పాలనకు శుక్రవారంతో రెండేళ్లు పూర్తికానుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఉన్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంది. 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం.. ప్రజలకు కనీసస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడం.. అత్యవసరమైన రోడ్లపై గుంతలు కూడా పూడ్చకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రజాగ్రహాన్ని చవిచూసింది. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు తీసుకుంది. ఈ రెండేళ్ల పాలనలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది.
కూటమి ప్రభుత్వ పాలనకు నేటితో రెండేళ్లు
వైసీపీ హయాంలో జిల్లావాసులకు ఇబ్బందులెన్నో
ప్రస్తుత పాలనలో పెండింగ్ పనులకు మోక్షం
ప్రాజెక్టులు, పరిశ్రమలు, రహదారులపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం, జూన్ 11(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ పాలనకు శుక్రవారంతో రెండేళ్లు పూర్తికానుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఉన్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంది. 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం.. ప్రజలకు కనీసస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడం.. అత్యవసరమైన రోడ్లపై గుంతలు కూడా పూడ్చకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రజాగ్రహాన్ని చవిచూసింది. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు తీసుకుంది. ఈ రెండేళ్ల పాలనలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. విద్య, వైద్యం, ఉపాధితోపాటు అటు సాగునీరు, తాగునీరు, రోడ్లు, మౌలిక వసతుల కల్పనలో జిల్లాకు ప్రాధాన్యమిచ్చింది. రానున్న మూడేళ్లలో మరింత అభివృద్ధి దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. మరోవైపు ప్రజలు చర్చించదగిన సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. పెన్షన్ల పెంపు, నిరుద్యోగులకు డీఎస్సీ, దీపం 2.0, స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతోంది.
కొలిక్కివచ్చిన ‘నేరడి’
రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న నేరడి బ్యారేజీ వివాదం.. కూటమి పాలనలో కొలిక్కివచ్చింది. వంశధార నది చెంతన ఉన్నా.. ఆ నీటిని వినియోగించుకుని నేరడిపై బ్యారేజీ నిర్మాణానికి సవాలక్ష అవాంతరాలు ఒడిశా ప్రభుత్వం నుంచి ఉండేవి. వైసీపీ హయాంలో ఆ సమస్యను పరిష్కారం కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఒడిశా ముఖ్యమంత్రిని కలిశారు. కానీ ఇసుమంతైనా ఫలితం లభించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఈ విషయమై కేంద్రమంత్రులతో చర్చించి... న్యాయపరంగా చిక్కులు లేకుండా ఇటీవల నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించారు. టెండర్లను పిలిచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసేశారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. ఈ మూడేళ్లలో పనులు పూర్తయితే సాగునీటి పరంగా జిల్లా రాష్ట్రంలోనూ ముందుస్థానంలో నిలవనుంది.
పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు
జిల్లాలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభించలేదు. మేజర్ పరిశ్రమలు ఎచ్చెర్ల నియోజకవర్గంలో అత్యధికంగా.. ఇతర ప్రాంతాల్లో స్వల్పంగానూ ఉన్నాయి. వైసీపీ హయాంలో 600 మంది పనిచేసే బీర్ల పరిశ్రమ కూడా కమీషన్లను ఇవ్వలేదన్న అంతర్గత కారణంతో... ఇతర కారణాలను చూపించి మూసివేయించారు. ఇప్పుడా పరిశ్రమ సైతం తెరచుకుంది. పరిశ్రమల యజమానులతో ప్రజాప్రతినిధులు పోరాటం ఫలితంగా స్థానిక యువతకు కొలువుల్లో ప్రాధాన్యం దక్కింది. పైడిభీమవరం, ఎచ్చెర్లలోని పరిశ్రమల్లో సుమారు 1200 మంది స్థానిక యువతకు వివిధ ఉద్యోగాలు లభించాయి.
పాతపట్నానికి తాగునీరు.. పలాసకు కేంద్రీయ విద్యాలయం
పాతపట్నం నియోజకవర్గంలో హిరమండలం రిజర్వాయర్, వంశధార, గొట్టాబ్యారేజీ ఉన్నాయి. అక్కడనుంచే ఉద్దానం ప్రాంతానికి తాగునీరు వెళ్తోంది. కానీ పాతపట్నం నియోజకవర్గంలో తాగునీటి సమస్యను గత ప్రభుత్వం పరిష్కరించలేదు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో రూ.260కోట్లు కేటాయించింది. పనులు సగానికిపైగా పూర్తయ్యాయి. తాగునీటి సమస్య త్వరలో పరిష్కారం కానుంది.
పలాస నియోజకవర్గంలో ఇటీవల కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేశారు. పలాసలో 15 ఏళ్లకుపైగా నిరీక్షిస్తున్న ఫ్లైఓవర్ సమస్యకు మోక్షం కలిగింది. దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారానికి ‘సింధూర జలసిరి’ పేరుతో నిధులు తీసుకువచ్చి పనులు చేపట్టారు. కిడ్నీ రోగాల వ్యాప్తికి గల కారణాలపై అన్వేషణ సాగుతోంది. గత ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ భవనం నిర్మించేసి.. 2014-19 మధ్యకాలంలో మంజూరుచేసిన డయాలసిస్ సెంటర్లనే అక్కడ ఏర్పాటు చేసింది. తాజాగా వివిధ రకాల నిధులతో మరో పది డయాలసిస్ కేంద్రాలను కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో ఏర్పాటుచేశారు. అత్యాధునిక పరికరాలను కూడా సమకూర్చారు. అలాగే జిల్లా పునర్విభజన తర్వాత సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లిపోయింది. తాజాగా మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
సాగునీటి పరంగా ముందడుగు
వంశధార కరకట్టల విషయాన్ని వైసీపీ వదిలేసింది. ఏకంగా రూ. 400 కోట్లతో కూటమి ప్రభుత్వం కరకట్టలను పూర్తిచేసేలా నిధులు మంజూరుచేసింది. ప్రస్తుతం యాభైశాతం పనులు పూర్తయ్యాయి. సమీప ప్రాంతాలు ముంపునకు గురికాకుండా.. సాగునీరు.. వృథా కాకుండా పనులు చేపడుతున్నారు. అలాగే వంశధార ఏప్రాన్‌ను సరిచేసే విషయంలో నిర్లక్ష్యం కమ్ముకుంది. ఈ విషయాన్ని నేరుగా సీఎం వద్ద ప్రస్తావించడంతో రూ.17కోట్లు మంజూరుచేశారు. పాతపట్నం నియోజకవర్గంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో రూ.3కోట్లతో నారాయణపురం కాలువను ఆధునికీకరించడంతో సుమారుగా 18వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. మడ్డువలస కాలువకు టెండర్లను గత ప్రభుత్వం పిలిచి మళ్లీ ఆపేసింది. ప్రస్తుత ప్రభుత్వం.. టెండర్లను పిలిచి రూ.12 కోట్లను కేటాయించింది. ప్రస్తుతం 10శాతం మేర పనులు జరిగాయి.
కొత్తరోడ్ల నిర్మాణం.. విస్తరణ
వైసీపీ హయాంలో జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు, ఒకరికి స్పీకర్ పదవితోపాటు.. ఇతర కీలక పదవులను కట్టబెట్టారు. కానీ వారు కనీసం రోడ్లను బాగుచేసుకోలేకపోయారు. ఈ విషయంలో ప్రజలు బాగావిసిగిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1500 కోట్లు పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల ద్వారా వెచ్చించి.. ఎనిమిది నియోజకవర్గాల్లో గుంతలులేని రోడ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఒకప్పుడు శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు నరకంలా ఉండేది. ఇప్పుడా పరిస్థితిలేదు. గిరిజన ప్రాంతాలకు సైతం సీసీ రోడ్ల నిర్మాణం, పలు చోట్ల రోడ్ల విస్తరణ చేపట్టారు. దీంతో మౌలిక వసతుల్లో ముఖ్యమైన రోడ్లు విషయంలో ప్రజలు సంతృప్తి చెందారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 150 కిలోమీటర్ల బీటీ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మాణం జరగడం విశేషం.
ఇవి పూర్తయితే..
కూటమి ప్రభుత్వం పోర్టులకు, పరిశ్రమలకు, ఉపాధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఇటీవల జీవోను జారీచేసింది. ఈ మూడేళ్లలో పూర్తయితే ఏకంగా 12వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం దక్కనుంది. శ్రీకాకుళం-విజయనగరం జిల్లా ప్రజలకు పరోక్ష ప్రయోజనం కలుగుతుంది. శ్రీకాకుళంలో కోడి రామ్మూర్తి స్టేడియం, శ్రీకాకుళం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, పాత్రునివలస వద్ద స్టేడియం ఏర్పాటు.. తోటపల్లి కాలువ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. వంశధార-నాగావళి నదుల అనుసంధానం, ఎత్తిపోతల పథకాల పనులు చేపడుతున్నారు. ఇక మూలపేట పోర్టు అతిత్వరలో పూర్తికానుంది. దీనికితోడు ప్రతిపాదన దశలో ఉన్న పలాస ఎయిర్‌పోర్టు.. పూర్తయితే జిల్లా రూపురేఖలు మారనున్నాయి. జల్‌జీవన్ మిషన్ పనులు పరుగులెత్తితే తాగునీటి సమస్య పునరావృతం కాదు. ఈ మూడేళ్లలో మరింత అభివృద్ధి పనులపై మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఫలితం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయితే కూటమికి జిల్లావాసుల నుంచి కూటమి ప్రభుత్వానికి మరింత ఆదరణ దక్కనుంది.