Share News

నేడు నీట్‌

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:17 AM

Arrangements made for the NEET exam దేశవ్యాప్తంగా వైద్యకళాశాలలు, దంత వైద్యకళాశాలు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయర్వేద వైద్య విద్య కోర్సులు, బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించనున్న ‘నీట్‌ యూజీ -2026’ పునఃపరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు నీట్‌
పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • నాలుగు కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు

  • హాజరుకానున్న 2,103 మంది అభ్యర్థులు

  • 11 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతి

  • మధ్యాహ్నం 1.30 గంటలకు మెయిన్‌ గేట్‌ మూత

  • డ్రెస్‌కోడ్‌ తప్పనిసరిగా పాటించాలి

  • శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌/ ఎచ్చెర్ల, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వైద్యకళాశాలలు, దంత వైద్యకళాశాలు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయర్వేద వైద్య విద్య కోర్సులు, బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించనున్న ‘నీట్‌ యూజీ -2026’ పునఃపరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది మే 3న నీట్‌ నిర్వహించారు. అప్పట్లో ప్రశ్నపత్రం లీక్‌కావడంతో ప్రజల నుంచి నిరసనలు వెలువెత్తాయి. దీంతో ఎన్టీఏ అప్పటి పరీక్షను రద్దు చేసి.. ఆదివారం పునఃపరీక్షను నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ పరీక్షకు జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 2,103 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురంలోని ట్రిపుల్‌ ఐటీ కేంద్రంలో 720 మంది, గుజరాతీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 240 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీకళాశాలలో 696 మంది, పెద్దపాడు కేంద్రీయ విద్యాలయంలో 447 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రతీ కేంద్రంలో తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటుతోపాటు తాగునీరు, విద్యుత్‌ సదుపాయాలు సిద్ధం చేశారు. వైద్యసేవల కోసం ప్రతి కేంద్రం వద్ద అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌(ఆమదాలవలస), శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు.

  • సూచనలివీ..

  • పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను ఒంటి గంటన్నర తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. మధ్యాహ్నం ఒంటిగంట కన్నా ముందుగా చేరుకోవడం మంచిది.

  • అడ్మిట్‌ కార్డు, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం, పాస్‌పోర్టు సైజు ఫొటోలు రెండు, అప్‌డేట్‌ చేసిన ఆధార్‌/ ఓటర్‌ కార్డు/ పాన్‌కార్డును అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

  • ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ వాచీలు, కాలిక్యూలేటర్లు, పర్సులు, ఎలాంటి మెటాలిక్‌ వస్తువులను అనుమతించరు. డ్రెస్‌కోడ్‌ విధిగా పాటించాలి. ఫార్మల్‌ దుస్తులు ధరించడం మంచిది. ఫుల్‌హ్యాండ్స్‌ షర్టులు వద్దు. పెద్దబటన్లు వున్న దుస్తులు, బూట్లు, చెవిపోగులు, జడ క్లిప్పులు, ఉంగరాలు, గొలుసులు, ముక్కుపుడకలు వంటివి ఉండకూడదు. సాధారణ స్లిప్పర్లు లేదా సన్నని సోల్‌ ఉన్న శాండల్స్‌ ధరించడం మంచిది.

  • ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

  • నీట్‌ రాయనున్న అభ్యర్థులకు ఆదివారం ఎక్స్‌ప్రెస్‌, మెట్రోఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు, అలా్ట్రపల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా ప్రజారవాణాధికారి అప్పలరాజు తెలిపారు. హాల్‌టికెట్‌ చూపించి, రెండు వైపులా ప్రయాణం సాగించవచ్చన్నారు. రాజాం, ఇచ్ఛాపురం, పలాస, సోంపేట, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట తదితర మార్గాల్లో సర్వీసులు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలన

  • వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించనున్న నీట్‌ కేంద్రాలను కలెక్టర్‌ స్వప్ని ల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి శనివా రం పరిశీలించారు. ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాం పస్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, ఆర్ట్స్‌ కళాశాల కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించి.. తగు సూచనలు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. కేంద్రాల్లో చీఫ్‌ సూపర్‌వైజర్లకు మాత్రమే ఫోన్‌ అనుమతి ఉంటుందని తెలిపా రు. పరీక్ష ముగిసిన వెంటనే సాయంత్రం 5.15 గంటల నుంచి 6 గంటలలోపు ఓఎంఆర్‌ షీట్లను సీఆర్‌పీఎఫ్‌ భద్రతతో పోస్టాఫీసుకు చేర్చి.. అక్కడ నుంచి నేరుగా న్యూఢిల్లీకి తరలిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, తహసీల్దార్‌ గణపతిరావు, టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు, ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌ ప్రొఫె సర్‌ సండ్ర అమరేంద్రకుమార్‌, క్యాంపస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గిరిధర్‌ మద్రాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:17 AM