Share News

21న నీట్‌

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:10 AM

Four centers in NEET జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో జాతీయ అర్హత- ప్రవేశ పరీక్ష (నీట్‌) ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

21న నీట్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

నాలుగు కేంద్రాలు.. 2,103 మంది అభ్యర్థులు

రైల్వేస్టేషన్‌, కాంప్లెక్స్‌ వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు

పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌/ కలెక్టరేట్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో జాతీయ అర్హత- ప్రవేశ పరీక్ష (నీట్‌) ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌.. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ‘జిల్లాలో నీట్‌కు 2,103 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురంలోని ట్రిపుల్‌ ఐటీ కేంద్రంలో 720 మంది, గుజరాతీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 240 మంది, ప్రభుత్వ డిగ్రీకళాశాల (శ్రీకాకుళం)లో 696 మంది, పెద్దపాడు కేంద్రీయ విద్యాలయంలో 447 మంది అభ్యర్థులను కేటాయించాం. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. 1.30 వరకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామ’ని తెలిపారు. ‘పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి. పరీక్షా కేంద్రాలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుతోపాటు తాగునీరు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించాలి. ప్రశ్నపత్రాలు స్ట్రాంగ్‌రూమ్‌ సీసీ పుటేజ్‌ పర్యవేక్షణలో పరీక్ష కేంద్రాలకు తరలించారు. వర్షాలకు పేపర్లు తడవకుండా పర్యవేక్షణ చేయాల’ని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌(ఆమదాలవలస), శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో కె.సాయిప్రత్యూష, డీఎంహెచ్‌వో డా.కె.అనిత, పరీక్షల కోఆర్డినేటర్‌ షోయమ్‌ ఆలం, ఆర్టీసీ డీఎం హెచ్‌.అమరసింహుడు, అసిస్టెంట్‌ కమిషనర్‌(ఎగ్జామ్‌) జి.చంద్రభూషణరావు, తహసీల్దార్లు చక్రవర్తి, కిరణ్‌కుమార్‌, శ్రీనివాసరావు, బి.గోపాల్‌, పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

నీట్‌ రాయనున్న అభ్యర్థులకు పరీక్ష రోజు ఎక్స్‌ప్రెస్‌, మెట్రోఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు, అలా్ట్రపల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా ప్రజారవాణాధికారి అప్పలరాజు తెలిపారు. హాల్‌టికెట్‌ చూపించి, రెండు వైపులా రాకపోకలు సాగించవచ్చునన్నారు. రాజాం, ఇచ్ఛాపురం, పలాస, సోంపేట, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట తదితర మార్గాల్లో సర్వీసులు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 18 , 2026 | 12:10 AM