Share News

చిన్నారి ఆరోగ్యానికి ‘నవచేతన’

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:24 PM

బిడ్డ పుట్టినప్పటి నుంచి వెయ్యిరోజుల వరకు అత్యంత కీలకమైన దశ. ఈ మూడేళ్లలో మెదడు అభివృద్ధి సుమారు 80శాతం పూర్తవుతుంది.

 చిన్నారి ఆరోగ్యానికి ‘నవచేతన’

-తొలి వెయ్యి రోజుల వరకూ వారి ఆరోగ్యంపై శ్రద్ధ

- ఏఐ సహాయంతో తొమ్మిది దశల్లో స్ర్కీనింగ్‌ పరీక్షలు

-ఆ వివరాలు నవచేతన యాప్‌లో నమోదు

- మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహదం

నరసన్నపేట, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): బిడ్డ పుట్టినప్పటి నుంచి వెయ్యిరోజుల వరకు అత్యంత కీలకమైన దశ. ఈ మూడేళ్లలో మెదడు అభివృద్ధి సుమారు 80శాతం పూర్తవుతుంది. ఈ సమయంలో చిన్నారి ఎదుగుదల, మెదడుపనితీరు, ఆహారపు అలవాట్లు, అభ్యసన అంశాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. వీటిలో ఏ లోపం ఉన్నా ఆ బిడ్డ భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వీటిని సరిగా అంచనా వేసేందుకు ఏఐ (కృత్రిమ మేధస్సు) వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఏఐ సాంకేతికతో రూపొందించిన ‘నవచేతన’ యాప్‌ను తీసుకువచ్చింది. వెయ్యిరోజుల దశలో ఏమైనా సమస్యలు ఉంటే ఉదాహరణకు ఎత్తు, మెదడు చురుగ్గా పనిచేయకపోవడం, రక్తహీనత తదితర అంశాలపై వైద్యఆరోగ్య శాఖ అధికారులతో చర్చిస్తారు. వైద్యులు సలహామేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. పిల్లల అభివృద్ధికి స్థూల,సూక్ష్మ నైపుణ్యాలు, భాషాభివృద్ధి, జ్ఞానాత్మక అభివృద్ధి, సామాజిక భావోద్వేగం వంటి ఐదు అంశాలుగా అంచనా వేస్తారు. చిన్నారుల్లో పుట్టుకతో వచ్చిన లోపాలు, వ్యాధులు, జన్యుపరమైన లోపాలు, వైకల్యాలతో సహా అభివృద్ధిలో అలసత్వం వంటి అంశాలను ఏఐ ఆధారిత స్ర్కీనింగ్‌ ఆధారంగా గుర్తించి నవ చేతన యాప్‌లో నమోదు చేస్తారు.

నవచేతన యాప్‌పై శిక్షణ

జిల్లాలో 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 3,385 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో 0-6 సంవత్సరాలు లోపు చిన్నారులు 75,187 మంది గర్భిణులు 9,908 మంది, బాలింతలు 9,827 మంది ఉన్నారు. ఆయా కేంద్రాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలకు నవచేతన యాప్‌పై సీడీపీవోలు, వైద్యులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల జీవితంలో మొదటి వెయ్యిరోజులు అంత్యంత కీలక దశ. అవయవాల అభివృద్ధి 80శాతం అప్పుడే జరుగుతుంది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు, ఇతర ఆరోగ్య వివరాలను ప్రతినెలా నమోదు చేస్తుంటారు. ఇకపై నవచేతన యాప్‌ ద్వారా తల్లిదండ్రులు, సంరక్షకుల అనుమతితో ఏఐ వినియోగించి చిన్నారుల ఎదుగుదల తీరును గమనించనున్నారు. చాలా వరకు ఆరోగ్యసమస్యల పాఠశాల వయస్సు వచ్చిన తరువాతే బయటపడతాయి. అలా కాకుండా ముందుగానే గుర్తించి, వైద్యసేవలు అందించి సరిచేయవచ్చనే ఉద్దేశంతో దీనిని పక్కాగా చేయాలని భావిస్తున్నారు.

స్ర్కీనింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తాం..

బాలల మేథో వికాసం, శారీరక అభివృద్ధి, జ్ఞానం, నైపుణ్యాలను తొమ్మిది దశల్లో వయస్సు వారీగా పరిశీలిస్తాం. మానసిక వైకల్యం, వినికిడి లోపాలు, వయస్సుకు తగ్గట్లుగా ఎదుగుదల లేకపోవడం వంటి ముఖ్యమైన లోపాలను గమనిస్తే వెంటనే యాప్‌లో నమోదు చేసి సత్వర వైద్యం అందేలా చూస్తాం. ప్రస్తుతం జిల్లాలో నవచేతన యాప్‌పై అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ జరుగుతోంది. ఆ తర్వాతే యాప్‌ ద్వారా స్ర్కీనింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

సువర్ణ, మహిళా శిశుసంక్షేమశాఖ అధికారి

Updated Date - Jun 10 , 2026 | 11:24 PM