Share News

జలుమూరు పాఠశాలకు జాతీయస్థాయి గుర్తింపు

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:13 AM

Selected as the best school జలుమూరు ప్రాథమిక ఆదర్శ పాఠశాల.. జాతీయస్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు ఇప్పిలి మాధవరావు, ఉపాధ్యాయుడు మెండ రామారావు తెలిపారు.

జలుమూరు పాఠశాలకు జాతీయస్థాయి గుర్తింపు
జలుమూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల

ఉత్తమ బడిగా ఎంపిక

జలుమూరు, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): జలుమూరు ప్రాథమిక ఆదర్శ పాఠశాల.. జాతీయస్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు ఇప్పిలి మాధవరావు, ఉపాధ్యాయుడు మెండ రామారావు తెలిపారు. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు సమాచారం అందించారని తెలిపారు. ‘పాఠశాలల్లో సురక్షితమైన నీటి నిర్వహణ, పారిశుధ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ హరిత విద్యాలయం’ కింద రాష్ట్రం నుంచి 8 పాఠశాలలు జాతీయస్థాయికి ఎంపికయ్యాయి. అందులో జిల్లా నుంచి జలుమూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ఈ పాఠశాల 2024లో జిల్లాలో ఉత్తమ పాఠశాలగాను, గతేడాది రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగాను ఎంపికైంది. తాజాగా జాతీయస్థాయికి ఎంపికకావడంతో ఎంతో ఆనందంగా ఉంద’ని వారు తెలిపారు. అలాగే ఈఏడాది పాఠశాలలో కొత్తగా 28 మంది విద్యార్థులను చేర్పించామన్నారు. జాతీయస్థాయి గుర్తింపులో కీలకపాత్ర పోషించిన ప్రధానోపాధ్యాయుడిని, ఉపాధ్యాయులను ఎంఈవోలు బి.మాధవరావు, ప్రసాదరావు అభినందించారు.

Updated Date - Jun 17 , 2026 | 12:13 AM