చివరి రోజు భారీగా!
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:18 AM
Nomination filing process concludes in municipalities స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందడి నెలకొంది. ఇచ్ఛాపురం, పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో చైర్పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆదివారం చివరి రోజుకావడంతో.. అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇచ్ఛాపురంలో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఆశి లీలారాణి, వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి పిలక రాజ్యలక్ష్మితోపాటు మరో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
రెండు మునిసిపాలిటీల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ
ఇచ్ఛాపురంలో చైర్పర్సన్ అభ్యర్థులుగా పది మంది పోటీ
కౌన్సిలర్లుగా 104 మంది బరిలోకి..
పలాసలో చైర్పర్సన్కు 11 మంది, కౌన్సిలర్లకు 156 మంది నామినేషన్లు
ఇచ్ఛాపురం/ పలాస, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందడి నెలకొంది. ఇచ్ఛాపురం, పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో చైర్పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆదివారం చివరి రోజుకావడంతో.. అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇచ్ఛాపురంలో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఆశి లీలారాణి, వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి పిలక రాజ్యలక్ష్మితోపాటు మరో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో టీడీపీ -2, వైసీపీ-2, జనసేన-1, కాంగ్రెస్-1, ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు కౌన్సిలర్లుగా 68మంది నామినేషన్లు వేశారు. అందులో టీడీపీ-30, వైసీపీ-27, జనసేన-3, బీజేపీ-2, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆరుగురు ఉన్నారు. మూడురోజుల్లో మొత్తంగా ఇచ్ఛాపురంలో చైర్పర్సన్ అభ్యర్థులు పది మంది, కౌన్సిలర్ అభ్యర్థులు 104 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.రమేష్ తెలిపారు.
పలాస-కాశీబుగ్గలో మునిసిపల్ చైర్పర్సన్ అభ్యర్థులుగా మొత్తం 11 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి ఇ.శ్రీనివాసులు ప్రకటించారు. చివరిరోజు ఆదివారం ఒక్కరోజే మొత్తం ఏడు మంది నామినేషన్లు వేశారు. దువ్వాడ శ్రీజ, లక్ష్మిప్రధాన్, సాయిభవానిప్రధాన్, తాళాసు శ్రీపద్మ, మన్యాల రమ్య, రెండు సెట్లుగా వజ్జ గంగాభవాని, వజ్జ అనూష, బద్రి సీతమ్మ, మల్లా మాధవి, తెంబూరి బేబీసరోజ నామినేషన్లు వేశారు. అలాగే కౌన్సిలర్ అభ్యర్థులుగా మొత్తం 156 మంది నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి 59 మంది, వైసీపీ - 68, జనసేన -10, స్వతంత్రులు 13 మంది నామినేషన్లు వేశారని ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు.
అట్టహాసంగా.. టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థుల నామినేషన్
పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా సాగింది. ఆదివారం ఇచ్ఛాపురం మునిసిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అభ్యర్థి ఆశి లీలారాణి నామినేషన్ వేశారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు భారీ ఊరేగింపుగా తరలివెళ్లాయి. చైర్పర్సన్ అభ్యర్థులు, కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నిబంధనల మేరకు పోలీసులు.. నామినేషన్ వేసే అభ్యర్థితోపాటు మరో ఇద్దరినే మాత్రమే లోపలకు అనుమతించారు. నామినేషన్ల సమయంలో కార్యాలయం బయట అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐలు మీసాల చిన్నమనాయుడు, మంగరాజుతోపాటు ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ దాసరి రాజు, టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పత్రి తవిటయ్య, ఎన్.కోటి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
పలాస- కాశీబుగ్గ మునిసిపల్ కార్యాలయంలో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి వజ్జ గంగాభవాని నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే గౌతు శిరీష, పలాస ఇన్చార్జి యార్గగడ్డ వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. తీన్మార్ డప్పులతో హోరెత్తించారు. చైర్పర్సన్ అభ్యర్థితోపాటు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారికి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావుయాదవ్, పీరుకట్ల విఠల్రావు, గాలి కృష్ణారావు, శాసనపురి మురళీకృష్ణ, మల్లా శ్రీనివాస్, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, ఎం.నరేంద్ర, ద డియాల నర్సింహులుతో పాటు 36 వార్డులకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు.