Share News

చిన్నితల్లీ.. చావే పరిష్కారమా?

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:28 AM

Inter student commits suicide in Karajada శ్రీకాకుళం మండలం కరజాడ గ్రామానికి చెందిన వమ్మరవల్లి విద్య (17) నరసన్నపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఇటీవల ఇదే కళాశాలలో ఓ విద్యార్థిని రూ.500 నగదు పోయింది. సదరు విద్యార్థిని, విద్య మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది.

చిన్నితల్లీ.. చావే పరిష్కారమా?

కరజాడలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

కళాశాల యాజమాన్యం మందలించిందని కూడా..

కేవలం 500 రూపాయిలు పోయిందని..

దొంగతనం నింద మోపడంతో మనస్తాపం

ఇంటికి వచ్చి ఉరివేసుకున్న ఇంటర్‌ బాలిక

ఎందుకు తల్లీ అంత తొందరపడ్డావు?

చేయని తప్పునకు ‘దొంగ’ అని నింద వేస్తే

ఆ బాధను నువ్వు మోయలేకపోయి ఉండొచ్చు

కానీ.. దానికి చావే ఏకైక పరిష్కారమవుతుందా?

నీకు ఏం కష్టం వచ్చినా.. బాధ కలిగినా..

పంచుకోవడానికి అమ్మా, నాన్న ఉన్నారు కదా!

నీపై వేసిన ఆ అపవాదు ఎంత అబద్ధమో

ఆ కన్నవారికి చెప్పుకుని ఉంటే..

నిన్ను గుండెలకు హత్తుకుని ఓదార్చి

ఆ నింద నుంచి కాపాడుకునే వారు కదా!

ఆవేశంలో నువ్వు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం

తల్లిదండ్రులకు తీరని కడపుకోత మిగిల్చింది కదా!

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం మండలం కరజాడ గ్రామానికి చెందిన వమ్మరవల్లి విద్య (17) నరసన్నపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఇటీవల ఇదే కళాశాలలో ఓ విద్యార్థిని రూ.500 నగదు పోయింది. సదరు విద్యార్థిని, విద్య మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో విద్య మీద దొంగతనం నింద మోపడమే కాకుండా కళాశాల యాజమాన్యం ఈమెను మందలించినట్లు సమాచారం. చేయని తప్పునకు అందరిముందూ తనపై నిందలు వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్య.. కళాశాల నుంచి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు కూడా లేరు. విద్య ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. 6.50 గంటల సమయంలో పక్కింటివారు చూసి విద్యను కిందకు దించి రిమ్స్‌కు తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలిక అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పొలానికి వెళ్లిన తల్లిదండ్రులు రాత్రి 8 గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చారు. విగతజీవిగా మారిన కూతుర్ని చూసి కుప్పకూలిపోయారు. తమ ఆశల సౌధం ఇకలేదని భోరున విలపించారు. తమ కూతురిపై దొంగతనం నింద మోపి కళాశాల యాజమాన్యం మందలించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కేవీ సురేష్‌ తెలిపారు. విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:29 AM