Share News

బిడ్డా.. నీ వెంటే వస్తున్నా..

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:10 AM

Mother passes away after hearing the news of her daughter's death ఆమదాలవలస మునిసిపాలిటీ 8వ వార్డులో నివసిస్తున్న పడాల చిన్నమ్మడు(62) కొన్నిరోజులుగా మధుమేహంతో బాధపడుతూ.. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మృతి చెందింది. ఈ విషయం సరుబుజ్జిలిలో నివసిస్తున్న తల్లి చందనాల సరోజనమ్మ(85)కు తెలిసింది. పెద్ద కుమార్తె చిన్నమ్మడు మృతి చెందిన మనస్తాపంతో ఆమె కూడా వెంటనే ప్రాణాలు విడిచింది.

బిడ్డా.. నీ వెంటే వస్తున్నా..
చిన్నమ్మడు, సరోజనమ్మ (ఫైల్‌)

  • కుమార్తె మరణవార్త విని.. ప్రాణం విడిచిన తల్లి

  • ఐదు నిమిషాల వ్యవధిలోనే ఇద్దరూ మృతి

  • సరుబుజ్జిలిలో శోకసంద్రం

  • నిన్నటి దాకా కొడుకును కోల్పోయిన దుఃఖం.. అంతలోనే కన్నబిడ్డ శాశ్వతంగా దూరమైందన్న వేదన! ఆ తల్లి తట్టుకోలేక పోయింది. ఆమదాలవలసలో కుమార్తె చిన్నమ్మడు (62) తుదిశ్వాస విడిచిందో లేదో.. అటు సరుబుజ్జిలో ఉన్న కన్నతల్లి సరోజనమ్మ (85) గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ‘నన్ను విడిచి వెళ్లావా బిడ్డా’ అన్న రోదన చివరి శ్వాసగా మారింది. కేవలం ఐదు నిమిషాల తేడాతో తల్లి, కూతుళ్లు ఈ లోకాన్ని విడిచిపోయారు.

  • సరుబుజ్జిలి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస మునిసిపాలిటీ 8వ వార్డులో నివసిస్తున్న పడాల చిన్నమ్మడు(62) కొన్నిరోజులుగా మధుమేహంతో బాధపడుతూ.. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మృతి చెందింది. ఈ విషయం సరుబుజ్జిలిలో నివసిస్తున్న తల్లి చందనాల సరోజనమ్మ(85)కు తెలిసింది. పెద్ద కుమార్తె చిన్నమ్మడు మృతి చెందిన మనస్తాపంతో ఆమె కూడా వెంటనే ప్రాణాలు విడిచింది. ఐదు నిమిషాల వ్యవధిలోనే తల్లీకుమార్తె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

  • సరోజనమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. సరుబుజ్జిలిలో చిన్న కుమారుడు అప్పారావు వద్ద ఉంటోంది. పెద్ద కుమారుడు వెంకటరావు ఇటీవల కిడ్నీవ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. ఆ బాధ నుంచి కోలుకోక ముందే ఆమదాలవలసలో ఉంటున్న తన కుమార్తె చిన్మమ్మడు మృతి చెందడంతో ఆమె మరింత వేదనకు గురైంది. బిడ్డా.. నీవెంటే నేను కూడా వస్తున్నానంటూ.. ప్రాణాలు విడిచింది.

  • సరోజనమ్మ చిన్న కుమారుడు అప్పారావు.. తన అక్క చిన్నమ్మడు కుమార్తె వరలక్ష్మీని వివాహం చేసుకున్నారు. చిన్నమ్మడుకి కుమారులు లేరు. దీంతో ఓ వైపు ఆమదాలవలసలో అక్కకు.. మరోవైపు సరుబుజ్జిలిలో కన్నతల్లికి అప్పారావు దహనసంస్కారాలు పూర్తిచేయాల్సి వచ్చింది. ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆమదాలవలస చేరుకుని.. చిన్నమ్మడు అంత్యక్రియలు పూర్తిచేశారు. తర్వాత వారంతా సరుబుజ్జిలి వెళ్లి తల్లి సరోజనమ్మకు అంతిమవీడ్కోలు పలికారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే తల్లీకుమార్తె మృతి చెందడంతో గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

Updated Date - Aug 13 , 2026 | 12:11 AM