ఓటు కోసం కొండ దిగాల్సిందే!
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:35 AM
Tribal voters face hardships మెళియాపుట్టి మండలంలోని కేరాశింగి, గూడ, చందనగిరి గ్రామాలు కొండపై ఉన్నాయి. ఇక్కడి గిరిజనులు ఓటేయాలంటే కొండ కిందకు దిగి నేలబొంతు ఆశ్రమ పాఠశాలలోని రెండు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సిందే.
ఏడు కిలోమీటర్లు నడవాల్సిందే
గిరిజన ఓటర్లకు తప్పని పాట్లు
మెళియాపుట్టి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టి మండలంలోని కేరాశింగి, గూడ, చందనగిరి గ్రామాలు కొండపై ఉన్నాయి. ఇక్కడి గిరిజనులు ఓటేయాలంటే కొండ కిందకు దిగి నేలబొంతు ఆశ్రమ పాఠశాలలోని రెండు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సిందే. ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,253 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా గిరిజనులు ఓటు వేసేందుకు కొండ పైనుంచి ఏడు కిలోమీటర్లు నడిచి దిగువున ఉన్న నేలబొంతు ఆశ్రమ పాఠశాలకు చేరుకోవాల్సి వస్తోంది. దీంతో చాలామంది ఓటుకు దూరంగా ఉంటున్నారు. అయితే, కొన్నిసార్లు పోటాపోటీ ఉంటే అభ్యర్థులే కొండపైకి వాహనాలను పంపించి ఓటర్లను నేలబొంతు పోలింగ్ కేంద్రానికి తీసుకు వస్తుంటారు. కొండపైనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ ప్రాంతం నక్సల్స్ ప్రాబల్యమున్నది కావడంతో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయటం కుదరదని అధికారులు చెబుతున్నారని గిరిజనులు వాపోతున్నారు.
మెళియాపుట్టి మండలం దీనబంధుపురం పంచాయతీ చింతలపోలూరు పోలింగ్ కేంద్రంలో కూడా సౌకర్యాలు లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ 1,067 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించి చింతలపోలూరు పాత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నోఏళ్లుగా పాఠశాల మూతపడి ఉండడంతో తలుపులు, ద్వారబంధాలకు చెదలు పట్టి శిథిలావస్థకు చేరాయి. దీంతో ఇక్కడ ఓటు వేయాలంటే ఓటర్లు భయపడే పరిస్థితి కనిపిస్తుంది.
జిల్లాలో 901 పోలింగ్ కేంద్రాలు
జిల్లాలో 910 గ్రామ పంచాయతీలకుగాను 901 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 16,04,171 మంది ఓటర్లు ఉన్నారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో పూర్థిస్థాయిలో సదుపాయాలు లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రాలకు మరమ్మతులు చేసి ఉపయోగించారు. ప్రస్తుతం అందులో కొన్ని పాడయ్యాయి. ఇప్పుడు మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాలను బాగు చేసేందుకు సమయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.